17.8 C
New York
Tuesday, September 21, 2021

ఇది ప్రజాస్వామ్యమా? దగాస్వామ్యమా? – పవర్ స్టార్ సూటి ప్రశ్న

మొన్న ఓటుకు నోటు , నిన్న నాగార్జున సాగ‌ర్ ద‌గ్గ‌ర 2 రాష్ట్రాల పోలీసుల గొడ‌వ‌, నేడు డేటా చోరీ కేసు . ఇలా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గారు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి గారు ఆడుతున్న రాజ‌కీయ చద‌రంగంలో 2 రాష్ట్రాల యువ‌త న‌లిగిపోతోంద‌ని జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షులు శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు స్ప‌ష్టం చేశారు. ఇద్ద‌రు బ‌ల‌మైన నాయ‌కులు ఆడుతున్న రాజ‌కీయ క్రీడ‌లో ప్ర‌జ‌లు న‌ష్ట‌పోతున్నార‌ని తెలిపారు. ప‌ల్నాడు గ‌డ్డ నుంచి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గారికి ఒక‌టే విన్న‌పం చేస్తున్నాను,  ఉద్య‌మం స‌మ‌యంలో చాలా తిట్టారు,  మీ ఉద్య‌మ స్ఫూర్తిని అర్ధం చేసుకుని భ‌రించామ‌ని, రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కూడా 2 రాష్ట్రాల మ‌ధ్య గొడ‌వలంటే ప్ర‌జ‌లు భ‌రించే స్థితిలో లేర‌ని తెలిపారు. ఒక‌ వైపు తెలుగుదేశం పార్టీ మాతో క‌లిసి రావాలని పిలుస్తోంది, మ‌రోవైపు టీఆర్ఎస్ పార్టీ జ‌గ‌న్, ప‌వ‌న్ ను క‌లుపుతాం అంటుంది. ఈ పొలిటిక‌ల్ గేమ్స్ చూసి చూసి విసుగొచ్చిందని అన్నారు.  2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ సీపీఐ, సీపీఎంతో త‌ప్ప ఏ పార్టీ తో క‌లిసిపోటీ చేయ‌దని పున‌రుద్ఘాటించారు. జ‌న‌సేన పార్టీ ప్ర‌జ‌లప‌క్షమే గానీ పార్టీల ప‌క్షం కాద‌న్నారు. తాజాగా గుంటూరు జిల్లా ప‌ల్నాడు ముఖ‌ద్వార‌మైన స‌ర‌స‌రావు పేట‌లో బ‌హిరంగ స‌భ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు ప్ర‌సంగిస్తూ.. “ప‌ల్నాడుతో ప్ర‌త్యేక అనుబంధం ఉంది. పన్నెండో శతాబ్దంలోనే బ్ర‌హ్మ‌నాయుడు అన్ని కులాలనూ సమంగా చూసిన గొప్ప వ్యక్తి. ఆయన కులాలను సమంగా చూసేందుకు చాప కూడు అనే సహపంక్తి బోజనాలను తీసుకొచ్చారు. బ్రహ్మనాయుడు తిరుగాడిన నేల సాక్షిగా చెబుతున్నా.. అన్ని కులాలు, మ‌తాలు, ప్రాంతాల‌ను స‌మానంగా చూసే విధానాన్ని తీసుకొస్తాం. అంద‌ర‌ని స‌మానంగా చూడ‌గ‌లిగే ప‌ల్నాడు నేల నేడు కొన్ని కుటుంబాల చేతిలో ఇరుక్కుపోయి న‌లిగిపోతుంది. ఆ కుటుంబాల చెర నుంచి ప్ర‌జ‌ల‌కు విముక్తి క‌లిగించ‌డానికే జ‌న‌సేన పార్టీ పెట్టాను. ఆర్థికంగా, సామాజికంగా వెనుక‌బ‌డిన అంద‌రికి స‌మాన అవ‌కాశాలు క‌ల్పిస్తాం.  వేల‌ కోట్లు ఉంటే ముఖ్య‌మంత్రులు అయిపోతారు అంటే చాలా మంది కుబేరులు ముఖ్య‌మంత్రులు అయ్యేవారు. ముఖ్య‌మంత్రి కావాలంటే కిరాయి మూక‌లు, రౌడీయిజం, వేల‌కోట్లు ఆస్తులు కాదు కావాల్సింది. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై బ‌లంగా మాట్లాడే భావ‌జాలం కావాలి. ఈ ప్రాంతంలో 32 ల‌క్ష‌ల ట‌న్నుల సున్న‌పురాయి గ‌నుల‌ను అక్ర‌మంగా త‌వ్వేస్తే ఎవ‌రూ మాట్లాడ‌రు. చట్ట సభల నుంచి భయపడి పారిపోతున్నారు. ప్ర‌భుత్వ ఖ‌జానాకు కోట్లు గండిప‌డుతుంటే స్థానిక ఎమ్మెల్యే ప్ర‌శ్నించ‌కుండా ఇంట్లో కూర్చుంటారు. ఇంత అన్యాయం జ‌రుగుతుంటే గొంతెత్తి బ‌లంగా నిల‌దీయ‌డానికి ఒక్క‌రు కూడా లేరు. చ‌ట్ట‌స‌భ‌ల్లో ప్ర‌శ్నించాల్సిన ప్ర‌తిప‌క్ష‌నాయ‌కుడు ముఖ్య‌మంత్రి అయితే గానీ రాన‌ని ప‌ట్టుప‌ట్టి కూర్చున్నారు..? మ‌రి అక్ర‌మ మైనింగ్ పై ప్ర‌శ్నించేదెవ‌రు..? జ‌న‌సేన పార్టీ ప్ర‌శ్నిస్తుంది. ఇన్ కంట్యాక్స్ , ప్రోఫెషన‌ల్ ట్యాక్స్ , మున్సిప‌ల్ ట్యాక్స్ ల‌తో విసుగిపోతున్న ఇక్క‌డ ప్ర‌జ‌ల‌కు కొత్త‌గా కొడుకు ట్యాక్స్ వ‌సూలు చేయ‌డం బాధ‌క‌రం . అస‌లు కొడుకు ట్యాక్స్ ఏంటి దారుణం కాక‌పోతే..? పోరాట‌యాత్ర మ‌లిద‌శ‌కు చేరింది. ఎక్క‌డో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ప్రారంభించాం. ప‌ల్నాడులో ముగించాం. జ‌న‌సేన పార్టీ పెట్టింది ముఖ్య‌మంత్రి అయిపోదామ‌నో, అద్భుతాలు చేస్తాన‌నో కాదు. తెలంగాణ ప్రాంత నాయ‌కులు ఆంధ్ర ప్ర‌జ‌ల‌ను దోపిడి దారులుగా చిత్రీక‌రించి తిడుతూ ఉంటే సోకాల్డ్ ప‌ల్నాడు నాయ‌కులు అని చెప్పుకునే వారు ఎవ‌రూ నోరెత్త‌లేదు. సొంత ప్రాంత ప్ర‌జ‌లు మీద మాత్రం కిరాయి మూక‌ల‌తో దాడులు చేయిస్తూ భ‌య‌పెట్టి బ‌తుకుతున్నారు. గుంటూరు జిల్లాలో పుట్టిన వాడిగా, ప‌ల్నాడు పౌరుషం నింపుకున్న‌వాడిగా, ఆంధ్రుల ఆత్మ‌గౌర‌వం కోసం, తెలుగుజాతి ఐక‌త్య‌కోసం పార్టీ పెట్టాను.  2014లో తెలుగుదేశం పార్టీకి ఏమీ ఆశించ‌కుండా మద్దతు తెలిపింది. ప్ర‌జ‌లంద‌రికి న్యాయం చేస్తార‌ని, కానీ తెలుగుదేశం పార్టీ నాయ‌కులు జ‌న‌సైనికులు మీద కేసులు పెట్టి చ‌చ్చేట్లు కొడుతున్నారు. తెలుగుదేశం నాయ‌కులు, నాయ‌కురాళ్ల‌కు ఒక‌టే చెబుతున్నాను. మీరు నా వ్య‌క్తిగ‌త జీవితం గురించి మాట్లాడేంత విలువ‌లు ఉన్నాయా మీకు..?  పోలీసు అధికారులు గొడ‌వ‌లు త‌గ్గించాల్సింది పోయి కేసులు పెట్టి చావ‌గొట్టారు. ఇది ప్ర‌జాస్వామ్యమా..? ద‌గాస్వామ్య‌మా..? ప‌ల్నాడు గ‌డ్డ నుంచి చెబుతున్నాను. కేసులు, దాడుల‌కు భ‌య‌ప‌డేవాడు కాదు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. మీరు నియంత్ర‌ణ పాటిస్తే మేము నియంత్ర‌ణ పాటిస్తాం. మీరు హ‌ద్దులు దాటితే మిమ్మ‌ల్ని మించి హ‌ద్దులు దాటుతామ‌న్నారు. రాష్ట్రంలో ఇన్ని పార్టీలు ఉన్నాయి. ఇది మా జెండా అని గుండె ధైర్యంతో తీసుకెళ్లే కార్య‌క‌ర్త‌లు కేవ‌లం జ‌న‌సేన పార్టీకే ఉన్నారు. దోపిడి వ్య‌వ‌స్థ‌పై పోరాటం చేయ‌డానికి ప‌ట్టుకున్న జెండా జ‌న‌సేన పార్టీ జెండా.  తెలుగుదేశం పార్టీ  మ‌ళ్లీ మా బాబుగారే రావాలి అంటుంది. చంద్ర‌బాబు మాత్రం త‌న కొడుకు రావాల‌ని కోరుకుంటున్నారు. ప్ర‌తిప‌క్ష పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి 30 ఏళ్లు తానే పాలించాలి, ప్ర‌తి ఇంట్లో త‌న ఫొటో పెట్టుకోవాల‌ని కోరుకుంటున్నాడు. ఒక్క జ‌న‌సేన పార్టీ మాత్రమే మీ ఇంట్లో మీ ఫొటో, మీ బిడ్డ‌ల ఫొటో పెట్టుకునేలా వారికి భ‌విష్య‌త్తు ఇవ్వాల‌ని కోరుకుంటుంది. ఉభ‌య‌గోదావ‌రి, కృష్ణ జిల్లాలోనే జ‌న‌సేన పార్టీకి బ‌లం ఉంది అని చాలామంది అన్నారు. కానీ ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల‌తో పోల్చితే రాయ‌ల‌సీమ‌, నెల్లూరు, ప్ర‌కాశంలో వేలాది మంది యువ‌త రోడ్ల‌పైకి వ‌చ్చి మార్పు కోసం జ‌న‌సేన పార్టీకి మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. రౌడీలు, కిరాయి మూక‌ల‌ను ఎదిరించే గుండెధైర్యం ఉన్న‌వాడిని. ప‌ల్నాడు గాలి పీల్చిన‌వాడిని మీ అంద‌రికి అండ‌గా ఉంటాను. ఒక్క‌సారి జ‌న‌సేన ప్ర‌భుత్వాన్ని తీసుకురండి. యువ‌కుల నుంచి బ‌ల‌మైన నాయ‌కుల‌ను త‌యారు చేస్తాం.  కుటుంబ రాజ‌కీయాల‌ను బ‌ద్ద‌లుకొట్టి స‌రికొత్త న‌వ‌త‌రాన్ని తీసుకొస్తాం. 2 ల‌క్ష‌ల కోట్లు బ‌డ్జెట్ ఉంటే అధికార‌, ప్ర‌తిప‌క్షాలు మాత్రం రూ. 5 ల‌క్ష‌ల కోట్ల హామీ ఇస్తున్నారు. మ్యానిఫెస్టో అంటే అబద్దాల పత్రంలా మార్చేశారు. కాంగ్రెస్ పార్టీకి మారుపేరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లా  న‌వ‌ర‌త్నాలు, వ‌జ్రాలు తీసుకొస్తామ‌ని హామీ ఇవ్వం. అమలు చేయ‌గ‌లిగే హామీలు మాత్ర‌మే జ‌న‌సేన పార్టీ ఇస్తుంది. మ‌హిళ‌ల‌కు ఉచిత గ్యాస్ , రేష‌న్ కు బ‌దులు బ్యాంకు ఖాతాలో రూ. 2500 నుంచి రూ. 3500 వ‌ర‌కు న‌గ‌దు జ‌మ‌, ప్ర‌జ‌లంద‌రికి ఉచిత విద్య‌, వైద్యం అందిస్తాం.  ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌ను, స్కూళ్ల‌ను కార్పొరేట్ ఆస్ప‌త్రులు, స్కూళ్ల‌కు దీటుగా అభివృద్ధి చేస్తాం. పోటీ ప‌రీక్ష‌లు రాసే విద్యార్ధులు ఒకేసారి ఫీజు క‌ట్టే విధానాన్ని తీసుకొస్తాం. రైతుల‌కు లాభ‌సాటి ధ‌ర క‌ల్పించ‌డంతో పాటు .. బ‌ల‌మైన వ్య‌వ‌సాయ విధానాలు తీసుకొస్తాం. రాష్ట్రంలో ప్ర‌తి ఒక్క‌రికి రూ. 10 ల‌క్ష‌ల భీమ ప‌థ‌కం తీసుకొస్తాం. సెజ్ ల పేరిట భూములు తీసుకొని ఉపాధి ఇవ్వడం లేదు. ఈ విధానం మారాలి. నిరుద్యోగ యువ‌త‌కు ఉద్యోగ, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించ‌డానికి ఆపర్చునిటీ  జోన్లు ఏర్పాటు చేస్తామ‌ని,  మొద‌టి జోన్ ప‌ల్నాడు నుంచే ప్రారంభిస్తామ‌”ని హామీ ఇచ్చారు.

Related Articles

Stay Connected

0FansLike
2,950FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!