19.9 C
New York
Tuesday, September 21, 2021

ఉపాధ్యాయులు, విద్యార్థుల జీవితాలతో ఆడుకొంటున్న ఆంధ్రా సర్కార్” – నాదెండ్ల మనోహర్

కరోనా మహమ్మారి బడులపై పిడుగుల వర్షం కురిపిస్తోంది. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. మరోప్రక్క ప్రభుత్వం మొండితనంతో విద్యార్థుల జీవితాలు ప్రశ్నార్థకమైంది. ఆంధ్రాలో కొందరు ఉపాధ్యాయులు కరోనా బారినపడ్డారు. మరికొందరు మృతి చెందారు. కొందరు విద్యార్థులు కూడా కోవిడ్‌తో ఇబ్బందులు పడుతున్న సంఘటనలు అక్కడక్కడా చోటు చేసుకున్నాయి. పదో తరగతి విద్యార్థులకు క్లాసులు జరుగుతుండడంతో పాఠశాలల్లో విస్తరిస్తోంది. కుటుంబాలకు కుటుంబాలే కోవిడ్‌ బారిన పడుతున్నారు. ఆసుపత్రుల్లో కనీస వసతులు లేవు. అధికారులు తూతూ మంత్రంగా విధులు నిర్వహిస్తున్నారు. కోవిడ్‌ టెస్ట్‌ ఫలితాలు వారానికి కూడా రావడం లేదు. మరోవైపు ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం మొండివైఖరి వీడడం లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం ప్రజలను వెంటాడుతోంది. ఒకరకంగా చెప్పాలంటే ప్రజల ఆరోగ్యం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి గారికి ఏ మాత్రం బాధ్యత లేదని అర్థం అవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకీ కోవిడ్ కేసులు పెరుగుతూ ఉంటే ప్రభుత్వ మూర్ఖత్వానికి పరాకాష్టగా  ఉపాధ్యాయులను కోవిడ్ కేంద్రాల్లో విధులకు పంపించడం. ఈ అర్థం లేని చర్యకు శ్రీ జగన్ రెడ్డి గారి సొంత జిల్లా కడపలోనే శ్రీకారం చుట్టారు. విద్యార్థుల యోగ క్షేమాలను ఏ మాత్రం పట్టించుకోకుండా ఉపాధ్యాయులను కోవిడ్ కేంద్రాలకు పంపించడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. పదో తరగతి విద్యార్థులకు ఇప్పటికీ తరగతులు నడుపుతున్నారు. ప్రతి విద్యార్థికి 3 మాస్కులు ఇచ్చి, షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పదేపదే చెబుతున్నారు. ఆయన మాటలు వింటుంటే ఈ ప్రభుత్వానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, వారి కుటుంబాల ఆరోగ్య క్షేమాల గురించి పట్టింపు లేదని అర్థం అవుతోంది. విద్యార్థుల తల్లితండ్రులు భయంతో ఉన్న సమయంలో ఉపాధ్యాయులను కోవిడ్ కేంద్రాల్లో డ్యూటీకి పంపించడం ఏమిటి? ఆ ఉపాధ్యాయులే పదో తరగతి పిల్లలకు పాఠాలు చెప్పాలి.. తర్వాత పరీక్షలు నిర్వహించాలి అంటే విద్యార్థులను కరోనా ముంగిట నిలిపే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వమే కల్పిస్తోంది. పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలకు సుమారు 16.5 లక్షల మంది విద్యార్థులు వెళ్లాల్సి ఉంది. పాఠాలు చెప్పేవారిని కోవిడ్ కేంద్రాల దగ్గర ఉద్యోగం చేయమని, ఆ తరవాత పిల్లలకు పరీక్షలు పెట్టమంటే అన్ని లక్షల మంది పిల్లలను, వారి కుటుంబాలను ముప్పులోకి నెట్టడమే అవుతుంది.  ప్రభుత్వం పంతాలు పట్టింపులకు పోకుండా పదో తరగతి, ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పరీక్షలను  తక్షణమే రద్దు చేయాలి. సి.బి.ఎస్.ఈ., తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల తరహాలోనే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడవద్దు. ఉపాధ్యాయులను కోవిడ్ కేంద్రాల దగ్గర విధులను నుంచి ఉపసంహరించుకోవాలి అని నాదెండ్ల మనోహర్ గారు తెలియజేసారు.  

Related Articles

Stay Connected

0FansLike
2,951FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!