17.8 C
New York
Tuesday, September 21, 2021

బీజేపీ మైండ్ గేమ్ – జనసేనాని నిర్ణయం ఏమిటి.?

కేంద్రంలో ఉన్న బీజేపీ ఆంధ్రాలో రాజకీయంగా బలపడేందుకు అనేక వ్యూహాలు అమలు చేస్తోంది. 2014 లో బీజేపీ-చంద్రబాబు-పవన్ ఒక్కటిగా ఉన్నారు. 2019 లో ఎవరికి వారు పోటీ చేసారు. జగన్ అధికారంలోకి వచ్చారు. ఆ వెంటనే భవిష్యత్ వ్యూహాల్లో భాగంగా బీజేపీ జనసేనానితో మైత్రి కోరుకుంది. అమెరికా వేదికగా మొదలైన మంతనాల పర్వం హైదరాబాద్ కు చేరింది. అనేక తర్జన భర్జనల తరువాత పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించారు. పొత్తు పైన ఢిల్లీలో ఒప్పందం జరిగింది. బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డాతో జనసేనాని పవన్ సమావేశమై కలిసి పని చేయాలని నిర్ణయించారు. ఇక, ఆంధ్రాలో నాటి బీజేపీ చీఫ్ కన్నాతో కలిసి ..రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ ..జనసేన నేతలు కలిసి రాష్ట్రంలో ప్రతీ కార్యక్రమం కలిసే చేస్తామని..పంచాయితీ నుండి పార్లమెంట్ దాకా పొత్తు ఉంటుందని తెలియజేసారు. కానీ, ఆచరణలో మాత్రం ఇప్పటి వరకరు 2 పార్టీలు కలిసి ఒక్క ఆందోళన కార్యక్రమం నిర్వహించలేదు. తిరుపతి ఉప ఎన్నికలో మాత్రమే కలిసి పని చేసారు. బీజేపీ-జనసేన పొత్తు ఖరారైన తరువాత పవన్ కళ్యాణ్ ఒక్కసారి మాత్రమే కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో కలిసారు. ఆ సమయంలో స్టీల్ ప్లాంట్ అంశం వరకే చర్చ పరిమితం అయింది. ప్రధానితో ఇప్పటి వరకు కలసి మాట్లాడటం  జరగలేదు. ఇతర రాష్ట్రాల్లో బీజేపీ మిత్రపక్షాల అధినేతలకు లభిస్తున్న అప్పాయింట్ మెంట్లు…దక్కుతున్న గౌరవం విషయంలో మాత్రం పవన్ కళ్యాన్ కు అన్యాయమే జరుగుతోంది. తెలంగాణ బీజేపీ నేతలు తమ పార్టీ నేతల పైన చేసిన కామెంట్స్ పై పవన్ తీవ్రంగా స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము పీవీ కుమార్తెకే మద్దతిస్తామని ప్రకటించారు. జాతీయ నేతలు తమకు గౌరవం ఇస్తున్నా..తెలంగాణ నేతల తీరు సరిగా లేదని కామెంట్ చేశారు. కానీ, తిరిగి ఖమ్మం.. వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేసారు. ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ ఛరిష్మా తమకు కలిసి వస్తుందని..బీజేపీ ముందుగా జనసేనతో పొత్తు పెట్టుకున్నట్లుగా విశ్లేషణలు ఉన్నాయి. తిరుపతి ఉప ఎన్నికలో పవన్ ప్రచారానికి వెళ్లిన రోజు మంచి స్పందన కనిపించింది. రెండో సారి ప్రచారానికి వెళ్లాల్సి ఉన్నా.. కరోనా కారణంగా దూరంగా ఉన్నారు. కానీ, ఫలితం మాత్రం భిన్నంగా వచ్చింది. ఇక, ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ కు ఢిల్లీ లభిస్తున్న గౌరవం పైనా చర్చ సాగుతోంది. హోం మంత్రి అప్పోయింట్ జగన్ కోరగానే…డిన్నర్ మీటింగ్ ఏర్పాటు చేసారు. కేంద్ర మంత్రులు సీఎం జగన్ ను ఆయన కారు వద్దకు వచ్చి వీడ్కోలు పలికారు. మరి..జగన్ కు అంత ప్రాధాన్యత ఇవ్వటం ఏంటనే చర్చ జనసేన కేడర్ లో వినిపిస్తోంది. అయితే, బీజేపీ నేతలు మాత్రం కేంద్రం-రాష్ట్ర ముఖ్యమంత్రి సంబంధాలు మాత్రమే అని చెప్పుకొస్తున్నారు. రాజ్యసభలో జగన్ పార్టీ మద్దతు.. తమకు కావాల్సిన వారికి వైసీపీ నుండి రాజ్యసభ సీట్ల విషయంలో మాత్రం నో ఆన్సర్. 2019 ఎన్నికలు పూర్తయి రెండేళ్ల కాలం గడిచి పోయింది. ఇప్పటి వరకు ఉమ్మడి ప్రణాళిక లేదు. 1,2 సార్లు తప్ప ఉమ్మడి సమావేశాలు లేవు. తిరుపతి ఎన్నికల సమయంలో బీజేపీ నేతలు వకీలీ సాబ్ సినిమా హాల్ వద్ద పవన్ కు మద్దతుగా కామెంట్స్ చేసారు. కరోనా నుండి పవన్ కోలుకున్నా..రాజకీయ వ్యవహారాలపైన సీరియస్ గా ఫోకస్ పెట్టటం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వాస్తవంగా జనసేన నాయకత్వం కంటే..కింది స్థాయిలోని జనసైనికులు…పవన్ అభిమానులు కొన్ని చోట్ల సర్పంచ్..వార్డు సభ్యులను సొంతంగా గెలిపించుకున్నారు. కార్యకర్తలు..అభిమానుల్లో అంత జోష్ ఉన్నా..దానిని ముందుకు తీసుకెళ్లటంలో జనసేన అధినాయ కత్వం మౌనం పాటిస్తోంది. పవన్ కళ్యాణ్ సైలెంట్ అయిపోయారు. బీజేపీ నిజంగా మిత్రపక్షంగా ఉందా…లేక, పవన్ ను రాజకీయంగా ముందస్తుగా ఫిక్స్ చేసిందా అనే సందేహం పార్టీలో వ్యక్తం అవుతోంది. టీడీపీ స్థానాన్ని ఏపీలో తాము దక్కించుకోవాలని చూస్తున్న బీజేపీ అందుకు పవన్ ను ఆయుధంగా వినియోగించుకోవాలని భావించింది. తిరుపతి ఉప ఎన్నిక సమయంలోనూ బీజేపీతో కాకుండా ఒంటరిగా పోటీ చేద్దామని జనసైనికుల నుండి ఒత్తిడి వచ్చింది . కానీ, పవన్ మాత్రం బీజేపీ నేతలు అడిగిన వెంటనే అంగీకరించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయంలోనూ అదే జరిగింది. బీజేపీకి మద్దతివ్వటమే కానీ, వారి నుండి జనసేనకు..పార్టీ అధినేతకు కలుగుతున్న ప్రయోజనం ఏంటేనేదే ఇప్పుడు జనసైనికుల ప్రశ్న. మరి..దీని పైన మౌనంగా ఉంటున్న జనసేనాని ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.