22.4 C
New York
Friday, September 17, 2021

ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోతోందని ఇటీవల కంట్రోలర్‌ అండ్ ఆడిటర్‌ జనరల్‌ ఆందోళన వ్యక్తం చేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ఎక్కువ అప్పులున్న రాష్ట్రంగాను, ఎక్కువ లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రంగానూ ఉందని, గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాలకు మించి 142% శాతం అప్పు చేసిందని ఆ సంస్థ పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో అప్పులపై వడ్డీలకే సుమారు 35 వేల కోట్ల రూపాయలు చెల్లించాలని అధికారుల అంచనా. కేంద్ర ప్రభుత్వ ద్రవ్య విధానం ప్రకారం ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా తన రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో మూడు శాతానికి మించి అప్పు చేయకూడదు. అయితే ఇటీవల ఒక మినహాయింపు ఇచ్చింది. అదేమిటంటే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా తన షరతులను ఆమోదించి, సంస్కరణలను అమలు చేస్తే అదనంగా అప్పు చేయవచ్చు. దీనికి అనుగుణంగా మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం తెలిపిన నాలుగు రంగాలలో సంస్కరణలు అమలు చేస్తూ ఐదు శాతం అప్పులకై అర్రులు చాస్తోంది. పలితంగా 2021 మార్చి 31 నాటికి రాష్ట్ర నికర అప్పు రూ.3,48,998 కోట్లకు చేరుకుంది. ఎందుకింత అప్పు చేస్తున్నారని ప్రశ్నిస్తే గత ప్రభుత్వం కూడా ఇలాగే చేసిందని చెబుతున్నారు.  కానీ వాస్తవ మేమిటంటే 2014–19 మధ్య ఐదేళ్లలో సగటున సాలుకు రూ.32,385 కోట్ల అప్పు చేస్తే, జగన్‌ ప్రభుత్వం గత ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే ఏకంగా లక్ష నాలుగు వేల కోట్ల రూపాయలకు పైగా అప్పు చేసింది. అప్పులు చేయడానికి ఏకంగా ఒక కార్పొరేషన్‌‍నే ఏర్పాటు చేసింది. అయితే ఈ అప్పుకు తగ్గట్లు రాష్ట్రంలో అభివృద్ధి ఏమీ కనపడడం లేదు.ఈ అప్పులకు తోడు కేంద్ర ప్రభుత్వ షరతులకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర ప్రయోజనాలకు భంగకరమైన కొన్ని నిర్ణయాలను కూడా తీసుకుంటోంది. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యాసంస్థల్లో సిలబస్‌ మార్పుతో పాటు మొత్తం విద్యావ్యవస్థలో సమూల మార్పులను చేసింది.తాజాగా పట్టణ ప్రజలపై ఇళ్ల పన్నుల భారాలు భారీగా పడేలా చట్ట సవరణ చేసింది. అంతకు ముందే విద్యుత్‌ మీటర్లు పెట్టాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాలన్నింటిలోనూ అంతర్లీనంగా కొన్ని అంశాలు మనకు గోచరిస్తాయి. ఇవన్నీ అప్రజాస్వామికంగా చేసిన నిర్ణయాలే. సంబంధిత ప్రజలతో కానీ, కనీసం రాష్ట్ర అసెంబ్లీలో కానీ చర్చించి చేసిన నిర్ణయాలు కాదు. వీటి వల్ల ప్రజలకు జరిగే మేలూ లేదు. సరికదా ప్రజలకు, రాష్ట్రానికి కీడే జరుగుతుంది. మన రాష్ట్రం 66.64 శాతం అక్షరాస్యతతో దేశంలో అట్టడుగు స్థానంలో ఉంది. సంపూర్ణ అక్షరాస్యత సాధించాలంటే విద్యార్థులు అందరికీ అందుబాటులో పాఠశాలలు ఉండాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వ నూతన విద్యావిధానం ఇందుకు భిన్నంగా ఉంది. ప్రస్తుతమున్న 10+3+2 విధానం నుంచి 5+3+3+4 అనే కొత్త విధానం అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.దీనికి తోడు అంగన్‌‍వాడి సెంటర్లను ప్రాథమిక విద్యలో కలపడం వల్ల పేద విద్యార్థుల చదువుతో పాటు, బాలింతలు, గర్భిణుల పౌష్టికాహారం కూడా ప్రశ్నార్థకమవుతుంది. ప్రభుత్వం ఎందుకిలా చేస్తోంది అని ప్రశ్నించుకుంటే, కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూపొందించిన జాతీయ విద్యావిధానం వల్లనే అన్న సమాధానం మాత్రమే వస్తుంది. ఈ విధానం అన్ని స్థాయిలలోనూ విద్యను ప్రైవేటుపరం చేయడమనే లక్ష్యంతో తయారయింది. రైతు పక్షపాతినని చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం విచిత్రంగా రైతులు నేడు ఉచితంగా వినియోగించుకునే విద్యుత్తుకు మీటర్లు పెట్టాలని నిర్ణయించింది.ఎందుకిలా చేస్తున్నారని ప్రశ్నిస్తే, ఎంత కరెంటు వాడుతున్నారో తెలియడానికని నమ్మబలికింది. లోతుగా ప్రశ్నించిన మీదట, రైతుకు ఇప్పుడిచ్చే ఉచిత కరెంటు స్థానంలో సబ్సిడీని నగదు రూపంలో బదలాయిస్తామని అసలు విషయం బయట పెట్టింది. రైతుకు మేలే చేయాలని భావిస్తే ఇప్పుడున్న ఉచిత విద్యుత్తు విధానమే కొనసాగించవచ్చు కదా! ఎందుకీ మార్పు? ఇటీవల కేంద్ర ప్రభుత్వం నూతన విద్యుత్‌ విధానాన్ని ప్రకటించి, దానికి అనుగుణంగా విద్యుత్‌ చట్టం 2003ను సవరించింది. ఆ సవరణల అమలుకు ప్రతిరూపమే నేటి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీలను ప్రైవేటీకరించాలన్నది, సబ్సిడీలను ఎత్తివేయాలన్నది కేంద్ర చట్టంలోని సారాంశం. గత నవంబర్‌ 23న రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్సు ద్వారా మునిసిపల్‌ చట్టాలకు సవరణలు చేసింది. దీని సారాంశం ఏమిటంటే ఇప్పటివరకు అద్దె విలువ ఆధారంగా ఇళ్ల పన్నులు విధిస్తుండగా దానిని కాస్తా ఆస్తి విలువ ఆధారంగా మార్చి వేసింది. దీనికి అనుగుణంగా ఆస్తి పన్ను, మురుగునీటి పన్ను, మంచి నీటి పన్నులను సవరిస్తూ ఆ మరునాడే మూడు జీవోలను జారీ చేసింది. ఈ జీవోల ప్రకారం ప్రతి సంవత్సరం పన్నులు పెరుగుతూనే ఉంటాయి. ఇంటి పన్ను అప్పుడు భూమికున్న మార్కెట్‌ విలువకు అనుగుణంగా 0.10 శాతం నుండి 0.50 శాతం మధ్య నిర్ణయించబడుతుంది. ఈ విధంగా లెక్కిస్తే ప్రస్తుతం ఉన్న పన్నుకంటే ఐదు లేక ఆరు రెట్లకు పైగా పన్ను పెరుగుతుంది.కొత్త పన్నును చేరుకునే వరకు పాత పన్నుపై 15శాతం చొప్పున ప్రతి సంవత్సరం పెంచుతూ పోతామని జీవోలో పేర్కొన్నారు. స్టాంప్స్‌ అండ్ రిజిస్ట్రేషన్‌ డిపార్టుమెంటు వారు భూమి / భవనం విలువ సవరించినప్పుడల్లా మరలా ఈ ఆస్తి పన్ను కూడా తదనుగుణంగా మారుతూ ఉంటుంది. వెరసి ఏటా ప్రజలపై పెద్ద ఎత్తున భారం పడి, ఇంటి పన్ను ఐదేళ్లలో రెట్టింపై పోతుంది. ఇక చెత్త పన్ను, నీటి పన్ను సరేసరి. ఒక పక్క ఇంతలా ప్రజల నడ్డి విరుస్తూ, మరో పక్క మునిసిపల్ శాఖ మంత్రి మాత్రం పెద్దగా భారం పడదని వాదన చేస్తున్నారు. పన్ను రెట్టింపు కావటం భారం కాకపోతే మరేమిటో! ఇది కూడా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన పట్టణ సంస్కరణలలో భాగమే.కరోనా కాలంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు పన్నుల చెల్లింపులో మినహాయింపులు ఇస్తుండగా, జగన్‌ ప్రభుత్వం మాత్రం భారాలు వేయడానికి పూనుకోవడం ఏ రకంగానూ సమర్ధనీయం కాదు. ఇలా అనేక రంగాలలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అన్ని సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడంలో ముందుంటోంది. ఇలా ఎందుకు చేస్తోందని ఎవరికైనా సందేహం రావచ్చు. కనపడని కారణాలను కూడా కొంతమంది చెప్పవచ్చు, కానీ కంటికి కనపడే కారణమేమిటంటే అప్పులు చేస్తేనే కానీ రోజు గడవని దుస్థితి నేడు రాష్ట్రంలో నెలకొంది. ఈ అప్పులు తెచ్చుకోవడానికి అనుగుణంగా అందుకు కేంద్రం పెట్టిన షరతులను గుడ్డిగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల, విశాఖ నగరంలోని జిల్లా కలెక్టరు కార్యాలయంతో సహా అనేక ప్రభుత్వ స్థలాలను తనఖా పెట్టడానికి కూడా సాహసించింది. విశాఖ, విజయవాడ, గుంటూరు వంటి ప్రధాన నగరాలలో తహశీల్దారు ఆఫీసులతో సహా అనేక కార్యాలయాల స్థలాలను అమ్మాకానికి పెట్టడాన్ని కూడా మనం చూశాం.ప్రజల ఆదాయాలు పెంచే ఉపాధి కల్పన లేకుండా, రోజువారీ ఖర్చులకు ఇలా అప్పులు చేసుకుంటూ, ఆస్తులు అమ్ముకుంటూ పోతే ఇది అంతిమంగా ఎక్కడికి దారితీస్తుంది? పైపెచ్చు ఇన్ని విషమ షరతులకు లోబడి అప్పులు తేవటమంటే రాష్ట్రాన్ని దివాళా తీయించడమే కదా? రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని తక్షణం విడనాడి, ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపై దృష్టి సారించడం శ్రేయస్కరం. రాష్ట్రానికి హక్కుగా రావలసిన ప్రత్యేక హోదా, అభివృద్ధి ప్యాకేజీలు, లోటు నిధుల భర్తీ, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాల అమలుకై వివిధ తరగతుల ప్రజల మద్దతు కూడగట్టి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ముఖ్యం.

Related Articles

Stay Connected

0FansLike
2,945FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles