21.9 C
New York
Tuesday, September 28, 2021

జనసేనాని వ్యూహకర్తను నియమించుకోవాలని డిసైడ్ అయ్యారా.?

ఆరువసంతాలు పూర్తి చేసుకుని ఏడో ఏడాదిలోకి అడుగుపెట్టింది జనసేన పార్టీ. ఆవిర్భావం నుంచి అనేక ఎత్తుపల్లాలు ఈ ఆరేళ్లలో జనసేన చవిచూసింది. 2014 ఎన్నికలకు ముందు ఆవిర్భవించిన జనసేన ఏపీ రాజకీయాల్లో పెను సంచలనాలు సృష్టిస్తుందనే పార్టీ పురుడు పోసుకున్న తొలినాళ్లలో అంతా భావించారు. ఒక పక్క టిడిపి పై అసంతృప్తి, అనుభవం లేని వైసిపి యుద్ధ క్షేత్రంలో జనసేన ముందు వున్నాయి. ఆంధ్రప్రదేశ్ విభజన ను తీవ్రంగా వ్యతిరేకించిన ఏపీ ప్రజలు జాతీయ పార్టీలైన కాంగ్రెస్ – బిజెపిలపై ఆగ్రహంతో ఊగిపోతున్న రోజులవి. సినిమాల్లో హీరో గా మాస్ ఇమేజ్ తో పాటు క్లీన్ ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ కి కోస్తాలో బలమైన కాపు సామాజిక వర్గం అండ ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ కొత్త పార్టీపై అనేక అంచనాలు ఏర్పడ్డాయి. సినిమాలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ 2008 నాటికి ప్రజారాజ్యం పార్టీలో కూడా తన వంతు పాత్ర నిర్వహించారు. ఇక ఆయన 2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీని పెట్టారు. జనసేన ఎన్నికల్లో పోటీ చేసి బలంగా నిలబడాల్సిన పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపకుండా ముందు బిజెపి ఆతరువాత టిడిపిలకు మద్దతు ప్రకటించారు. అనుభవజ్ఞుడైన చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఏపీ కష్టాలు తొలగించే సత్తా ఉన్న వ్యక్తి అనే స్లోగన్ పైకి తెచ్చారు పవన్. పాతికేళ్ళపాటు రాజకీయాల్లో ఉంటా అని మోడీ తోనే దేశాభివృద్ధి, ఏపీ కి న్యాయం జరుగుతాయని విస్తృత ప్రచారం సాగించారు. కట్ చేస్తే కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు కానీ పవన్ కల్యాణ్ ఆశించిన న్యాయం వారి నుంచి ఎపి వాసులకు దక్కలేదు. ఆ తరువాత టిడిపి నుంచి కానీ బిజెపి నుంచి కానీ ఏ పదవిని కూడా జనసేనాని ఆశించలేదు. ఎన్నికలకు ఏడాది ముందు మాత్రం ఆయన టిడిపి, బిజెపి లకు ఎదురు తిరిగారు. ఆ రెండు పార్టీలతోపాటు వైసిపి ఓటమి తన లక్ష్యం అంటూ గేర్ మార్చి యూ టర్న్ కొట్టారు పవన్ కల్యాణ్. కమ్యూనిస్ట్ లు, బీఎస్పీ లతో పొత్తు పెట్టుకుని భిన్నమైన వ్యూహంతో సాగారు. అయితే ఈ ప్రయత్నం 2019 ఎన్నికల్లో ఘోరంగా విఫలం అయ్యింది. జనసేన కేవలం ఒక్క స్థానమే దక్కింది. ఆ ఎమ్యెల్యే కూడా ఆపార్టీలో కొనసాగుతున్నారో లేదో తనకే అర్ధం కావడం లేదని అధినేతే వాపోయేలా పరిస్థితి మారిపోయింది. వైసిపి అధికారం చేపట్టాక మరిన్ని కష్టాలు జనసేన ను వెంటాడాయి. పార్టీలో టికెట్లు పొంది ఓటమి పాలైనవారు వ్యూహకర్తలు జనసేనకు దూరం అయ్యారు. సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మి నారాయణ తో సహా పాలిట్ బ్యూరో బ్యాచ్ కూడా గుడ్ బై కొట్టేశారు. ఈ పరిణామాలు జనసేన క్యాడర్ లో ఆత్మస్థైర్యం దెబ్బకొట్టిన పవన్ కళ్యాణ్ మాత్రం ధైర్యం వీడలేదు. ఉండేవారు వుండండి పోయేవారు పొండి అంటూ తన వెంట ఎవరు వున్నా లేకపోయినా పార్టీ కొనసాగిస్తా అని ప్రకటించేశారు పవన్. అంతే కాదు ఈ మధ్యలో అందర్నీ ఆశ్చర్య పరుస్తూ ఏ ఎన్నికలు లేని సమయంలోనే బిజెపి తో చేతులు కలిపి ఏపీ లో నడుస్తామని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇలా అనేక దెబ్బలు తగిలి తగిలి ఇప్పుడు రాటుదేలుతున్నారు పవన్ కల్యాణ్. పార్టీకి ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు ఉండకూడదని సినిమాల్లో నటించకూడదని గతంలో తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ప్రస్థానం మొదలు పెట్టారు పవన్. ఇలా సాగుతున్న జనసేన ప్రయాణం లో కొత్త పంథాను రూపొందించారు పవన్. ప్రజలకు దగ్గరయ్యే మార్గాలను జనసేనాని అన్వేషిస్తున్నారు. కరోనా మహమ్మారి నుండి పూర్తిగా కోలుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పట్లో పూర్తిస్థాయి రాజకీయాలపై దృష్టి పెట్టే అవకాశాలు లేవు. ఆయనకు సినీ గ్లామర్ మీద నమ్మకం పోయిందంటున్నారు. ప్రజల్లో ఉంటేనే ఓట్లు రాలుతాయని గుర్తించారు. తాను ప్రస్తుతం పార్టీని నడిపేందుకు సినిమాలు చేస్తున్నప్పటికీ, పవన్ కల్యాణ్ పూర్తి స్థాయి రాజకీయాలు చేయాలని భావిస్తున్నారు. అభిమానులు, సామాజికవర్గం ఓట్లు తనకు పెద్దగా విజయం సాధించి పెట్టలేవని పవన్ కల్యాణ్ డిసైడ్ అయ్యారు. ఇందుకోసం పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికలకు వ్యూహకర్తను నియమించుకోవాలని డిసైడ్ అయ్యారంటున్నారు. ఇందుకోసం పేరున్న సంస్థలతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పోటీ చేయాల్సిన స్థానాలను ఈ సంస్థ డిసైడ్ చేయాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. తనకు క్షేత్రస్థాయి నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ పై నమ్మకం లేదు. తన ఎదుట నేతలు వాస్తవ పరిస్థితిని వివరించడం లేదని తెలిసింది. దీంతో ఒక ప్రఖ్యాత ఆంగ్ల దినపత్రికతో పవన్ కల్యాణ్ ఒప్పందం చేసుకుంటారనే వార్తలు వినవస్తున్నాయి. క్షేత్రస్థాయిలో సర్వే చేసి జనసేనకు బలం ఉన్న ప్రాంతాలను ఈ సంస్థ గుర్తించి ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పాటు రాష్ట్రంలో ఏ యే నియోజకవర్గాల్లో వైసీపీ, టీడీపీ తర్వాత జనసేన బలంగా ఉంది? అక్కడ బీజేపీ బలం ఎంత? బీజేపీతో కలసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రయోజనం ఉంటుందా? తదితర విషయాలను ఈ సర్వేద్వారా పవన్ కల్యాణ్ తెలుసుకోవాలనుకుంటున్నారు. ఆ సర్వేల నివేదికను బట్టి అభ్యర్థుల ఎంపిక, పొత్తుల వంటివి ఉంటాయని జనసేన పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2024 ఎన్నికల్లో కొడితే కుంభస్థలాన్నే కొట్టాలన్నదే పవన్ కల్యాణ్ ఆలోచన. అందుకే ముందు జాగ్రత్త చర్యగా తన బలం ఎక్కడ? ఎంత? అన్న వివరాలను తెలుసుకుని వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. కొత్త పంథాలో సమాజానికి ఉపయోగపడే అంశాలకు ప్రధాన ప్రాధాన్యత ఇస్తే జనసేన ప్రయాణం వచ్చే రోజుల్లో సాఫీగా సాగవచ్చు. విమర్శలు, ఆరోపణలు కాదు పనికొచ్చే పనిచేద్దాం మార్పు కోసం అడుగులు వేద్దాం అనే రీతిలో జనసేన కొత్త ప్రస్థానం ఏ మేరకు విజయతీరాలు చేరుస్తుందో చూడాలి.

Related Articles

Stay Connected

0FansLike
2,960FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!