23.2 C
New York
Tuesday, September 21, 2021

టీడీపీ కి బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్ వెనుక జనసేనాని ఉన్నారా.?

టీడీపీ-జనసేన పార్టీలు 2014లో పొత్తులతో ఎన్నికలకు వెళ్లిన విషయం తెలిసిందే. టీడీపీకి జనసేన మద్దతు ఇవ్వడంతో ఆ ఎన్నికల్లో గెలిచి టీడీపీ అధికారంలోకి రావడానికి.. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి జనసేన పరోక్షంగా సాయపడింది. పవన్ అభిమానులు కూడా తమ హీరో చెప్పినట్టే టీడీపీకి మద్దతిచ్చారు. దీంతో చంద్రబాబు-పవన్ కల్యాణ్ మధ్య మైత్రి కొన్నాళ్లు బాగానే జరిగింది. అయితే.. 2018లో వారిద్దరి బంధానికి తెర పడింది. 2019 ఎన్నికల్లో విడివిడిగానే ఎన్నికలకు వెళ్లారు. వైసీపీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచీ టీడీపీ-జనసేన మధ్య అధినాయకత్వంలో పెద్దగా గొడవలు లేకపోయినా కిందిస్థాయిలో మాత్రం గొడవలు జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉంది. మూడో పెద్ద పార్టీగా జనసేన ఉంది. టీడీపీ కార్యకర్తలు, జనసైనికుల మధ్య బంధం నివురుగప్పిన నిప్పులానే ఉంది. చంద్రబాబు-పవన్ మాత్రం ఒకరిపై ఒకరు ఎప్పుడూ విమర్శలు చేసుకోలేదు. మొన్నటి ఎన్నికల్లో కూడా ఇరువురూ పరస్పరం విమర్శలు చేసుకున్నారు. ఇప్పుడు వీరి గొడవ కాస్త అఫీషియల్ గానే జరుగుతోంది. పరిషత్ ఎన్నికలను టీడీపీ బహిష్కరిస్తోందని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో జనసేన క్యాడర్ ఒక అడుగు ముందుకేసి ట్విట్టర్లో #EndOfTdp అనే హ్యాష్ ట్యాగ్ వైరల్ చేసింది. దీంతో అవకాశం కోసం చూస్తున్న టీడీపీ కార్యకర్తలకు తిరుపతి ఉప ఎన్నికలో నవతరం పార్టికి కేంద్ర ఎన్నికల కమిషన్ గ్లాస్ గుర్తు కేటాయించడం కలిసొచ్చింది. #JspChapterClose, #UselessTeluguDesamParty అనే హ్యాష్ ట్యాగ్స్ వైరల్ చేయడం మొదలెట్టారు. ఇలా వీరిద్దరూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసుకోవడం మొదలెట్టారు. ఒకరిపై ఒకరు పోస్టులు, కార్టూన్లు, విమర్శలు, కౌంటర్లు చేసుకుంటున్నారు. అధికార వైసీపీని వదిలేసి ఈ 2 పార్టీల కార్యకర్తలు వాదులాడుకుంటున్నారు. నిజానికి జనసేన-టీడీపీ మధ్య తెర వెనుక పొత్తు ఉందనేది వైసీపీ వాదన. అందుకే చంద్రబాబు అధికారంలో ఉండగా జరిగిన తప్పులను అప్పుడూ.. ప్రతిపక్షంలోకి వచ్చాక ఇప్పుడూ కూడా పవన్ వ్యతిరేకించరని విమర్శిస్తూ ఉంటుంది. ఇదంతా నిజం కాదని వీరి వాదన తెలియజేస్తోంది. ఏదైమైనా టీడీపీ-జనసేన స్నేహితులే అనే వాదనను ఈ సోషల్ మీడియా ఖండిస్తున్నట్టే ఉంది. మరి.. లోపల.. లోలోపల ఏం జరుగుతుందో.. లోగుట్టు పెరుమాళ్ల కెరుక..! అనుకునేలోపు తెరపైకి బీజేపీ రావడంతో అసలు విషయం అర్ధమయ్యింది. వివరాల్లోకి వెళ్తే.. బీజేపీ-టీడీపీ-జనసేన.. కూటమిపై మళ్లీ చంద్రబాబు ఆశలు పెట్టుకున్నట్టే ఉన్నారు. మహానాడులో.. ‘ఏపీలో 2024 ఎన్నికలే లక్ష్యంగా అధికారపార్టీపై పోరులో భాగంగా విపక్షాలతో కలిసి వెళ్తాం. కేంద్రంలో బీజేపీకి విడతలవారీ మద్దతిస్తాం’ అని ఓ ప్రకటన చేశారు. దీనిపై బీజేపీ ఘాటుగానే స్పందించింది. ‘ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచినట్టే మోదీని చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. మాకు జనసేనతో గట్టి పొత్తు ఉంది. వైసీపీ, టీడీపీలపై పోరు సాగిస్తాం’ అని సునీల్ దియోధర్.. ‘టీడీపీ పాచికలు ఇక పారవు. జనసేనతో బలమైన పొత్తుతో కలిసి ఎన్నికలకు వెళ్తాం’ అని విష్ణువర్ధన్ రెడ్డి టీడీపీకి దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు. అయితే విష్ణువర్ధన్ రెడ్డి  కామెంట్స్ వెనుక జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉన్నారా? అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. బీజేపీ-జనసేన.. 2024 ఎన్నికలే లక్ష్యంగా తమ పొత్తు కొనసాగుతుందని గతంలోనే స్పష్టం చేశాయి. మొన్నటి తిరుపతి ఉప ఎన్నికల్లో సైతం కలిసే వెళ్లారు. అయితే.. బీజేపీ తీరుపై పవన్ అసహనం వ్యక్తం చేస్తే.. అధిష్టానం ఆఘమేఘాల మీద క్లియర్ చేసేసింది. ఇప్పుడంతా ఓకే. అందుకే చంద్రబాబు ఆలోచనను ఆదిలోనే గట్టిగా ఖండించి.. జనసేనతో మైత్రి బలమెంతో చెప్పింది. అయితే.. బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్ వెనుక పవన్ కల్యాణ్ ఉన్నారనే సందేహాలు వస్తున్నాయి. ఇప్పటికీ టీడీపీ బీ-టీమ్ అనే ముద్రను జనసేన చెరుపుకోలేకపోతోంది. రాష్ట్రంలో ఎదగాలని బీజేపీ చూస్తోంది. బీజేపీ-జనసేనకు ఒకరి మద్దతు మరొకరికి అవసరం. అందుకే టీడీపీతో సంబంధంలేని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే బీజేపీతో టీడీపీకి గట్టి కౌంటర్ పవన్ ఇప్పించారనీ చెప్పొచ్చు. బీజేపీ-జనసేనను వదులుకుని ఎంత నష్టపోయామో 2019 ఎన్నికల్లో చూసారు చంద్రబాబు. బీజేపీతో నాడు విభేధించి.. మోదీని విమర్శించి ఇటివల పొగిడిన సందర్భాలూ ఉన్నాయి. అయితే.. 2014లో తమ మద్దతుతో గెలిచి.. తర్వాత దూరం పెట్టిన చంద్రబాబుని వీరూ మర్చిపోలేదు. తమను వాడుకుని టీడీపీ లాభపడుతోందని గ్రహించారు. అందుకే 2024 ఎన్నికలే లక్ష్యంగా వెళ్లాలన్నా.. తమ మైత్రిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నా ఇప్పటినుంచే ఖచ్చితంగా ఉండాలి. అందుకే టీడీపీపై బీజేపీ ఈస్థాయిలో ఫైర్ అయిందని చెప్పాలి. అయితే.. పవన్ కు తెలీకుండా.. పవన్ ప్రమేయం లేకుండా బీజేపీ ఇంత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిందని మాత్రం చెప్పలేం.

Related Articles

Stay Connected

0FansLike
2,952FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!