17.8 C
New York
Tuesday, September 21, 2021

జనసేన పార్టీ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన జనసేనుడు

ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. ముఖ్యమంత్రి జగన్ భద్రత పేరుతో ఆయన ఇంటికి దగ్గరలో ఉన్న ఇళ్లను ఖాళీ‌ చేయిస్తారా.? చుట్టుపక్కల వున్న  ఆడపడుచులను పచ్చి బూతులను తిడతారా.? అని పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నాయకులు ఉంటే.. ఆడబిడ్డలపై ‌మానభంగాలు ఆగుతాయా.? అని ప్రశ్నించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ముఖ్యమంత్రి జగన్ ఇంటి ముందే ఉద్యమం చేపడతామని సంచలన ప్రకటన చేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం తనను కలిసిన తాడేపల్లి కరకట్ట వాసులకు పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా తమ కష్టాలను, సమస్యలను పవన్‌కు తెలియజేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ‌నివాసం‌ చుట్టూ ఉన్నవారిని ఖాళీ‌ చేయాలని నోటీసులు ఇచ్చారని, ముందు స్థలంలో ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా ఖాళీ‌ చేయాలని బెదిరిస్తున్నారని బాధితులు పవన్ కళ్యాణ్ ముందు వాపోయారు. అర్ధరాత్రి ఇళ్ల మీదకు ప్రొక్లెయినర్లను పంపిస్తున్నారని, అదేమని అడిగితే చెప్పలేని విధంగా బూతులు తిట్టి‌ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 30 ఏళ్లుగా ఉంటున్న తమకు కనీసం గూడు లేకుండా చేస్తున్నారని తెలిపారు. తమకు అండగా నిలబడి ఉద్యమం చేయాలని పవన్‌కు బాధితులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. సీఎం ఇంటి‌ చుట్టూ ఉన్నవారికే రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. 35 ఏళ్లుగా ఉన్న వారికి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. భయపెట్టి, బెదిరిద్దాం అనుకుంటే ప్రజలు భయపడబోరని పవన్ హెచ్చరించారు. ఒకవేళ ఖాళీ చేయించడం తప్పని సరైతే… బాధితులకు ముందు న్యాయం చేయాలన్నారు. 350 కుటుంబాలకు ముందు ఇళ్లు ఇచ్చాకే అక్కడి నుంచి ఖాళీ చేయించాలని తేల్చి చెప్పారు. ఒకవేళ ముఖ్యమంత్రి జగన్ మొండిగా ముందుకెళితే.. జనసేన తరఫున సీఎం నివాసం వద్దే ఉద్యమం చేపడతామని పవన్ తీవ్రంగా హెచ్చరించారు. కరోనా కారణంగా 3 నెలల పాటు ప్రజా జీవితానికి దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ తొలిసారిగా బుధవారం విజయవాడ వచ్చారు. పార్టీ కార్యాలయంలో పీఏసీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ వైఫల్యాలు- కోవిడ్ నియంత్రణ- జాబ్ క్యాలెండర్- ఇతర ప్రజా సమస్యలపై చర్చించారు. జనసేన రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. రాష్ట్ర, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులను పవన్ నియమించారు. రాష్ట్ర కార్యవర్గంలోకి చల్లా మదుసూధన్‌రెడ్డి, విజయ్ కుమార్‌లను తీసుకున్నారు. లీగల్ సెల్‌కి ప్రతాప్, డాక్టర్ సెల్‌కి రఘు, ఐటీ సెల్‌కి శివరాంలను నియమించారు.  చేనేత సెల్‌కి సుభాష్, పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా కల్యాణపు శ్రీనివాస్‌లను నియమిస్తూ జనసేనాని ఆదేశాలు జారీ చేశారు. అలాగే రాష్ట్రంలోని జిల్లాలకు అధ్యక్షులను నియమించారు.  తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడిగా కందుల దుర్గేష్, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా గోవింద్ ను నియమించారు.కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా రామకృష్ణ, విజయవాడ అధ్యక్షుడిగా పోతిన వెంకట మహేష్, కార్యదర్శిగా అమ్మిశెట్టి వాసులను నియమించారు. గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా గాదె వెంకటేశ్వరరావు, ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా షేక్ రియాజ్‌లను నియమించారు. అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా పి.సి.వర్మ, చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా పసుపులేటి హరిప్రసాద్‌ లను నియమిస్తూ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. కాగా,  కోవిడ్ కారణంగా మరణించిన వారి కుటుంబ సభ్యులకు భీమా చెక్కులను పంచారు. పవన్ పర్యటన సందర్భంగా పవన్ ఫ్యాన్స్, జనసేన పార్టీ కార్యకర్తలు మంగళగిరి కార్యాలయానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు.

Related Articles

Stay Connected

0FansLike
2,950FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!