23.3 C
New York
Friday, September 17, 2021

ఎంపీ రఘురామ కృష్ణరాజు అరెస్టుపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్

నరసాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు అరెస్టుపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఫైరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విశృంఖలంగా విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కదిలించి ప్రజలను రక్షించవలసి ఉండగా.. ఎంపీ రఘురామ కృష్ణరాజును అరెస్టు చేయడం ఏమాత్రం సమర్ధింపు చర్య కాదని జనసేన భావిస్తోందన్నారు. వివరాల్లోకి వెళ్తే.. నర్సాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజును ఏపీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ పోలీసులు అరెస్టు చేశారు. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య హైదరాబాద్‌లోని ఎంపీ రఘురామ నివాసానికి సీఐడీ పోలీసులు వెళ్లారు. ఈ సందర్భంగా సీఐడీ పోలీసులతో ఎంపీ రఘురామ గొడవకి దిగారు. తనను ఏ కేసులో అరెస్టు చేయడానికి వచ్చారని రఘురామ పోలీసులను నిలదీశారు. తమతో సీఐడీ కార్యాలయానికి వస్తే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పి రఘురామరాజుపై ఐపీసీ- 124 ఏ సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా కామెంట్స్  చేశారన్న ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేశారు. అయితే, బలవంతంగా తన తండ్రిని పోలీసులు అరెస్టు చేశారని ఎంపీ రఘురామ కుమారుడు భరత్ తెలియజేసారు. 35 మంది వ్యక్తులు మఫ్టీతో వచ్చి, కనీసం వారెంట్ కూడా ఇవ్వకుండా తీసుకెళ్లారని ఆయన తెలిపారు. గుండె సంబంధిత వ్యాధితో తన తండ్రి రఘురామ బాధపడుతున్నారని, పుట్టిన రోజు నాడే వారెంట్‌ లేకుండా తన తండ్రిని అరెస్ట్‌ చేశారని,  అరెస్ట్‌కు కారణాలు కూడా చెప్పకుండా.. కోర్టులో చూసుకోండని సీఐడీ అధికారులు అన్నారని భరత్ తెలిపారు. తన తండ్రిని ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియదని, అధికారం చేతిలో ఉందని ఏమైనా చేస్తారా? అని ప్రశ్నించారు. ‘‘కరోనా సమయంలో ఒక ఎంపీని ఎలా అరెస్ట్‌ చేస్తారు? రఘురామకు ఆరోగ్యం కూడా బాగాలేదు. ఇదంతా ఓ స్కెచ్. వాళ్లు సీఐడీ ఆఫీసర్‌లో.. రౌడీలో అర్థం కావడం లేదు. రఘురామ అరెస్ట్‌పై కోర్టులో హౌస్‌మోషన్‌ దాఖలు చేస్తాం’’ అని ఆయన ప్రకటించారు. ఇదిలా ఉంటె.. గత కొంతకాలంగా జగన్ సర్కార్‌పై రఘురామ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి తదితరులపై ఆయన పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వ తప్పులను ఎండగడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు రావడం.. అరెస్ట్ చేయడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ సంఘటనకు స్పందించిన జనసేనాని పవన్ కళ్యాణ్ తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ప్రభుత్వాన్ని తరుచూ తీవ్రంగా విమర్శిస్తున్నారనే కారణంతో ఎంపీని సమయం, సందర్భం లేకుండా అరెస్టు చేయడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఒక పక్క కరోనా సోకిన వారికి ఆస్పత్రుల్లో బెడ్లు దొరక్క, ఆక్సిజన్ అందక, రెమిడిసివర్ ఇంజక్షన్లు బ్లాక్ మార్కెట్లకు తరలిపోతుండగా అవసరమైన మందుల కోసం పది షాపులు తిరగవలసిన క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ యంత్రాంగం అంతా ప్రజల బాధలపై దృష్టిపెట్టాలి. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసు బలగాలను ఉపయోగించి అరెస్టు చేయడం అప్రజాస్వామికంగా జనసేన భావిస్తోంది. ఒక పక్క ఆంధ్రప్రదేశ్ నుంచి వైద్యం కోసం వెళుతున్న అంబులెన్స్‌లను పక్క రాష్ట్ర సరిహద్దుల్లో ఆపేసినా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోంది. చివరికి తెలంగాణ హైకోర్టు జోక్యం చేసుకుంటే గానీ అంబులెన్స్‌లు కదిలే పరిస్థితి రాలేదు. రాష్ట్రంలో కోవిడ్‌ను ఏదో అద్భుతాలు సృష్టించి ఆపమని జనసేన కోరడం లేదు. వైద్యపరంగా అక్కడున్న వనరులు, వైద్య సిబ్బంది, ఇతరత్ర అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతోంది. ప్రత్యర్థి పార్టీ నేతలతో పాటు సొంత పార్టీ ఎంపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఇలాంటి విపత్కర సమయంలో సొంత పార్టీ ఎంపీనీ అరెస్టు చేయడంపై చూపించిన శ్రద్ధ ఏ విధంగా హేతుబద్ధమో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాల్సి ఉంది. ఊరూరా కొల్లలుగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని భయంభయంగా గడుపుతున్నారు. ప్రజల్లో మనో ధైర్యాన్ని నింపి, ఆక్సిజన్, మందులు, ఆస్పత్రుల్లో బెడ్లు అందేలా ప్రభుత్వం తన దృష్టిని కేంద్రీకరించాలని జనసేన విజ్ఞప్తి చేస్తోంది. కొంత కాలంపాటైనా రాజకీయ అవినీతిని కట్టిపెట్టాలని డిమాండ్ చేస్తోంది.’’ అని జనసేనాని పవన్ కళ్యాణ్ తెలియజేసారు. 

Related Articles

Stay Connected

0FansLike
2,945FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles