22 C
New York
Wednesday, September 22, 2021

యువతకు కావాల్సింది 25 కేజీల బియ్యం కాదు.. 25 సంవత్సరాల భవిష్యత్తు – జనసేనుడి సంచలన కామెంట్స్

రెండు వేలు ఇచ్చి ఓట్లు కొనుక్కునే విధానం.. ఓటు అమ్మకునే విధానం మారాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సుదీర్ఘ విరామం తరువాత రాజకీయంగా మరోసారి ముఖ్యమంత్రి జగన్ పైన సంచలన కామెంట్స్ చేసారు. రాజకీయ నాయకులంటే పేకాట క్లబ్ లు‌నడిపే వారు కాదని, సూట్ కేసు కంపెనీలు పెట్టి కోట్లు కొల్లగొట్టే వారు నాయకులు కాదని, కొత్త తరం నాయకులు, కొత్త రాజకీయం రావాలన్నారు. తాను వృద్దుడిగా అయ్యే లోపు రాజకీయ మార్పు వస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. తప్పు చేస్తే… శిక్ష తప్పదు అనే భయం ఉండాలి. ప్రజలు కూడా తమ ఆలోచనల తీరు మార్చుకోవాలని సూచించారు. ఓటు‌వేసే ముందు సామాజిక ప్రయోజనాలా… వ్యక్తిగత ప్రయోజనం కావాలా అనేది ఆలోచించాలని కోరారు. ప్రజల్లో ఈ ఆలోచన వచ్చినప్పుడే రాజకీయ వ్యవస్థ మారుతుందని పవన్ చెప్పడం విశేషం.  స్వతంత్య్ర సాధన కోసం ఆ తరం నాయకులు.. 150 సంవత్సరాల పాటు ఎలాంటి గుర్తింపు కోరుకోకుండా, ఉన్న గుర్తింపు, పేరు వదులుకుని పోరాటం చేశారని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. జాతి కోసం ప్రాణాలు కోల్పోయిన అద్భుతమైన వ్యక్తులు మనకున్నారని.. ఇలాంటి మహానుభావుల ప్రేరణతోనే జనసేనను స్థాపించినట్లు తెలిపారు. భావితరాల కోసం వారంతా ఎలాంటి త్యాగం చేశారో.. దాన్ని కాపాడేందుకు, ఓ తరం కోసం 25 సంవత్సరాల పాటు బలంగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. 2018లో ఉత్తరాంధ్ర ప్రాంతంలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు ఆ ప్రాంత యువత తమకు కావాల్సింది 25 కేజీల బియ్యం కాదు.. 25 సంవత్సరాల భవిష్యత్తు అని కోరారని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. యువత భవిష్యత్తుకు ఏంచేస్తున్నామన్నది ఆలోచించడం లేదని, ఈ దేశం తాలూకు శక్తే ధర్మమని.. అది అందరికీ సమానంగా అందాలని పవన్ కళ్యాణ్ అన్నారు. ఒక మతం ఎక్కువ.. ఒక కులం తక్కువ అన్న భావనలు ఉండరాదని తేల్చి చెప్పారు. రాజకీయ నాయకులు వచ్చి ఒక కులం మీద కక్ష సాధిస్తే., తర్వాత వచ్చే వారు మరో కులం మీద కక్ష సాధిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. నాయకులు ఇలాంటి విచ్ఛిన్నకర రాజకీయాలకు కాకుండా దేశ ఉన్నతికి పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రపంచ దేశాల అభివృద్ధిలో భారతీయుల పాత్ర ఎంతో ఉందని, కానీ మన‌దేశానికి వారు సేవలు అందించలేకపోతున్నారన్నారు. ఇందుకు మన రాజకీయ నాయకులే ప్రధాన కారణమని చెప్పుకొచ్చారు. పార్టీ నాయకులతోనూ పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. జగన్ ప్రభుత్వం రోజురోజుకీ ప్రజల్లో విశ్వాసం కోల్పోతోందని పార్టీ నేతల సమావేశంలో పవన్ కళ్యాణ్ తెలియజేసారు. ప్రజా సమస్యలపైన ఎక్కడికక్కడ పోరాటాలకు సిద్దం కావాలంటూ నేతలకు పిలుపునిచ్చారు. తాజాగా బీజేపీ నేతలతో జరిగిన సమన్వయ కమిటీ సమావేశాలను పవన్ పార్టీ నేతలతో పంచుకున్నారు.

Related Articles

Stay Connected

0FansLike
2,951FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!