23.2 C
New York
Sunday, September 19, 2021

పవన్ కళ్యాణ్ ఒక్క పిలుపు ఫాన్స్ కు తారకమంత్రమౌతుంది

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దేశంలో కొన్ని చోట్ల లాక్‌డౌన్ ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. లాక్ డౌన్ ప్రకటించిన ఊర్లలోని  జనాలు ఇళ్లలో నుంచి బయటకు రాకూడదని అధికారులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు. లాక్‌డౌన్ దెబ్బకు ఒక్కసారిగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇలాంటి విపత్కార పరిస్థితుల్లో సామాజిక స్పృహ ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్క పిలుపు అభిమానులకు తారకమంత్రం అవుతోంది. కరోనా విజృంభిస్తున్న వేళ ప్రజలకు అండగా నిలవాలని జనసేన కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. జనసేన రాజకయ వ్యవహారాల కమిటీ సభ్యులు, సమన్వయ కమిటీ సభ్యులు, నేతలతో పవన్ కళ్యాణ్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్రం ప్రజా ఆరోగ్యం విషయంలో స్పష్టమైన ఆదేశాలిచ్చిందని… అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. మన దగ్గర లాక్ డౌన్ విధించిన క్రమంలో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై దృష్టి పెట్టాలని అన్నారు. రైతులు, కార్మికులు, పేదలు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోవాలని ఆదేశించారు. వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు. కేంద్రం విడుదల చేసిన నిధులు ఏ విధంగా ఖర్చవుతున్నాయో దృష్టి పెట్టాలని పవన్ కళ్యాణ్ సూచించారు. పార్టీ కార్యకర్తలకు వచ్చిన సమస్యలను పార్టీ కార్యాలయానికి నివేదిక ఇవ్వాలని దిశానిర్ధేశం చేశారు. జనసేన కార్యకర్తలు, తమ కుటుంబసభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన సూచనలను అనుసరించండని, అంతకు మించి వేరే దారి లేదని ఆయన ప్రజలను కోరారు. దయచేసి అందరూ ఇంటికే పరిమితం కావాలని కోరుతున్నానని, బయటికి ఎవరు రావద్దని కోరారు. ఒకవేళ ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా, ప్రాణా పాయ పరిస్థితులు ఎదురైనా ఎమర్జెన్సీ నెంబర్లకు ఫోన్ చేసి సేవలు, సూచనలు పొందమని కోరారు. ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అందరూ సహకరించాలని కోరుతున్నానని పవన్  సందర్భంగా తెలియజేసారు. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంతో గొప్పదని, బాద్యతతో కూడుకున్న జవాబుదారీ తనం రాజకీయ వ్యవస్థ ఆవిష్కృతమైనప్పుడే దాని గొప్పదనం తెలుస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు. అనుకోని విపత్తు నెలకొన్న ప్రస్తుత తరుణంలో ప్రజల పట్ల బాధ్యత, జవాబుదారీతనం ఉండే వ్యవస్థ రూపుదిద్దుకోవాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థ రావాల్సిన తరుణం కూడా ఇదే అని చెప్పుకొచ్చారు. ప్రజా సమస్యలను విస్మరిస్తున్న ప్రజా ప్రతినిధులను బలంగా ప్రశ్నించాలని పవన్ పిలుపునిచ్చారు. మూకుమ్మడిగా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న నాయకులందరిని తరిమికొట్టాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. కరోనా వైరస్ క్లిష్ట సమయంలో ఏపిలోని ప్రతి జిల్లా నుంచి సమాచారం వస్తోందని, అధికార పక్ష నాయకుల వ్యవహార శైలి గురించి కూడా సమాచారం తెలుస్తూనే ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు. అలాగే దూర ప్రాంతాల నుండి స్వస్థలాలకు చేరుతున్నవారిని ఆదరించాలని, వారి ఆరోగ్య విషయం పట్ల శ్రద్ధ చూపాలని పవన్ కోరారు. వారి కోసం ఏర్పాటు చేస్తున్న క్వారంటైన్ కేంద్రాల్లో తగిన వసతులు లేవనీ, వైద్య సదుపాయాల కల్పన సక్రమంగా ఉండటం లేదనే ఆరోపణలు వస్తున్నాయని పవన్ ఆవేదన వ్యక్తం చేసారు. ఇలాంటి అంశాల పట్ల జనసేన నాయకులు, పార్టీ శ్రేణులు దృష్టి సారించి, సమస్య పరిష్కారానికి తక్షణం చర్యలు తీసుకోవాలని పవన్ పిలుపునిచ్చారు. సమస్య తీవ్రతను బట్టి రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలని, కరోనాకు సంబంధించిన పరీక్షలు కూడా ఎక్కువగా చేయడం లేదనీ, పాజిటివ్ కేసులు ప్రకటిస్తున్న వాటికంటే ఆ సంఖ్య ఎక్కువగానే ఉంటున్న విషయం పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని పవన్ కోరారు. అంతే కాకుండా లాక్‌డౌన్ లేని ఊర్లలో కూడా  మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని, కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్న సందర్బంలో అప్రమత్తంగా ఉండాలని పవన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కరోనా విపత్తు వేళ రాజకీయాల కంటే సేవా భావమే ముఖ్యమని జనసేన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసారు. క్లిష్ట సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలిగేలా వ్యవస్థలోని వ్యక్తులు పని చేస్తే తప్పకుండా నిలదీయాలని అన్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా జనసేన అండగా నిలబడుతుందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత జవాబుదారీతనంగా ఉన్నామనేదే ముఖ్యమని పవన్ తెలిపారు. ఇకపోతే అనేక ప్రాంతాలలో తినడానికి తిండి లేక నిత్యావసర సరుకుల లేక ఇబ్బంది పడుతున్న పేదవాళ్లకు జనసేన కార్మికులు 6 రకాల కూరగాయలను అందజేస్తున్నారు. మురికివాడల్లో తల దాచుకుంటున్న వృద్ధులకు కూడా జనసేన పార్టీ కార్యకర్తలు బియ్యం కూరగాయలను అందజేస్తున్నారు. అయితే ఈ కూరగాయలు దానం చేసే కార్యక్రమం లో పాల్గొంటున్న ప్రతి ఒక్క జనసేన పార్టీ కార్యకర్త భౌతిక దూరాన్ని పాటించడంతో పాటు మాస్కులను ధరిస్తూ లాక్ డౌన్ నిబంధనలను పర్ఫెక్ట్ గా పాటిస్తున్నారు. ఏది ఏమైనా ఆకలి తో అల్లాడుతున్న పేద ప్రజలకు సాయం చేయడం అనేది మెచ్చుకోదగిన గొప్ప పని అని చెప్పుకోవచ్చు. కేవలం జనసేన పార్టీ కార్యకర్తలు కాకుండా మిగతా పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా తమ వంతుగా పేద ప్రజలకు సహకారం చేస్తూ వారి ఆకలిని తీరుస్తున్నారు.  

Related Articles

Stay Connected

0FansLike
2,945FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles