17.7 C
New York
Tuesday, October 19, 2021

తిరుగులేని సాక్ష్యం

పొడుగ్గా, గుండ్రని డబ్బాలా వున్న దాన్నేచూస్తున్నారు పోలీసు అధికారులు.‘‘అపూర్వ సాక్షి!’’ అనిపించింది చూస్తూంటే. లోపలేముందో విప్పి చూడలేని దీంతోచాలా తంటాలుంటాయని అప్పుడే తెలీదు. ‘‘అమెజాన్‌కి రాసి డేటా తీయించాలి’’ అనుకున్నారు. కచ్చితంగా మర్డర్‌ ఎలా జరిగిందో ఇది సాక్ష్యమిస్తుందని నోటీసులిచ్చారు. ప్రైవసీ చట్టాలు ఒప్పుకోవని వచ్చిన జవాబు చూసి, ‘‘నీతో కూడా ప్రైవసీతంటాలేనా అలెక్సా?’’ అని దీనంగా చూశారు డబ్బాలా వున్నఅమెజాన్‌ ఎకో వైపు.

అమెరికాలోని బెంటన్‌ విల్లీ పట్టణంలో ఆ రాత్రి. మ్యాచ్‌ చూద్దామని ఫ్రెండ్స్‌ ఇద్దరిని పిల్చాడు బేట్స్‌, ‘‘అలెక్సా, ఇప్పుడొస్తున్న సాకర్‌ మ్యాచ్‌ పెట్టు’’ అన్నాడు. అటు టేబుల్‌ మీద ఠీవిగా కొలువు దీరిన అమెజాన్‌ ఎకో, టీవీలో సాకర్‌ మ్యాచ్‌ పెట్టింది. బేట్స్‌ భార్య వచ్చి, ‘‘అలెక్సా, సాఫ్ట్‌ మ్యూజిక్‌ వుంటే పెట్టమ్మా’’ అంది. మ్యూజిక్‌ సిస్టమ్‌లో సాఫ్ట్‌ మ్యూజిక్‌ మొదలైంది. ‘‘అలెక్సా, ఏం మ్యూజిక్‌ పెట్టావమ్మా?’’ అనడిగింది.‘‘రిలాక్స్‌ డైలీ’’ అని చెప్పింది ఎకో. ఫ్రెండ్స్‌తో బీరూ వోడ్కా సేవిస్తూ మ్యాచ్‌ ఎంజాయ్‌ చేశాడు బేట్స్‌. తెల్లారే 911కి కాల్‌ చేశాడు కంగారుగా. పోలీసు టీం దిగిపోయారు. బేట్స్‌తో బాత్‌ రూమ్‌లో కెళ్ళారు. టబ్‌ నీళ్ళల్లో వెల్లికిలా శవం… 47 ఏళ్ల మాజీ పోలీసు అధికారి కొలీన్స్‌. కలవరపడి, ఏం జరిగిందని అడిగారు.

రాత్రి ఇతనితో, ఇంకో ఫ్రెండ్‌తో కలిసి మ్యాచ్‌ చూస్తూ నిద్రవస్తే ఒంటి గంటకు వెళ్లి పడుకున్నాననీ, తెల్లారిలేచి చూస్తే ఇలా కన్పించిందనీ చెప్పాడు బేట్స్‌. కొలీన్స్‌ ఎడం కన్ను, కింది పెదవి చిట్లి వున్నాయి. టబ్‌ పక్కన సీసా పగిలి వుంది. అక్కడంతా రక్తముంది. తాగిన మైకంలో ప్రమాదవశాత్తూ జరిగిన మరణంలా లేదు. రెండో ఫ్రెండ్‌ గురించి అడిగితే, తను నిద్రపోబోతూండగా వచ్చి ఇంటికెళ్తున్నట్టు చెప్పేసి వెళ్లిపోయాడని చెప్పాడు బేట్స్‌. వారం తర్వాత హత్యని నిర్ధారిస్తూ పీఎం రిపోర్టు రావడంతో బేట్స్‌ని అరెస్ట్‌ చేశారు. ఇంట్లో చూస్తే స్మార్ట్‌ హోం డివైసులు చాలా వున్నాయి. నెస్ట్‌ థెర్మో స్టాట్‌, హనీవెల్‌ అలారం, వైర్లెస్‌ వెదర్‌ మానిటరింగ్‌ సిస్టం, అమెజాన్‌ ఎకో…

‘‘ఏమిటిది?’’ అడిగారు ఎకోని కొత్తగా చూస్తూ. కొత్తగా మార్కెట్లోకి వచ్చిందనీ, బాగా హెల్ప్‌ చేస్తుందనీ చెప్పాడు బేట్స్‌.‘‘ఎలా?’’‘‘దీనికి చెప్తే ఇంటర్నెట్‌తో కనెక్ట్‌ అయివుండే ఏ పరికరాన్నయినా ఆపరేట్‌ చేస్తుంది సర్‌. ముందుగా ‘అలెక్సా’ అని వేక్‌వర్డ్‌ పలకాలి. ఆ తర్వాత ఏం చేయాలో చెప్పాలి. అలెక్సా, ఈ రూంలో లైటాఫ్‌ చెయ్‌- అంటే ఆఫ్‌ చేయించేస్తుంది. అలెక్సా, రెస్టారెంట్‌లో డిన్నర్‌ ఆర్డర్‌ చెయ్‌ – అంటే ఆర్డర్‌ చేసేస్తుంది. అలెక్సా, ఓలాకి కాల్‌ చెయ్‌ – అంటే ఓలాకి కాల్‌ చేసి క్యాబ్‌ బుక్‌ చేస్తుంది. అపాయింట్‌మెంట్స్‌ ఏమున్నాయో అడిగితే కూడా చెప్పేస్తుంది తేదీ, సమయంతో సహా. అడిగిన మ్యూజిక్‌ కూడా పెడుతుంది సర్‌’’ ‘‘మ్యూజిక్కా? ఏదీ పెట్టించు?’’బేట్స్‌ ఎకోతో మ్యూజిక్‌ పెట్టించాడు.‘‘ఏవైపు నుంచి మనం మాట్లాడినా ఏడు మైక్రో ఫోన్లతో వింటుంది సర్‌. ఎన్ని శబ్దాలున్నా గొంతు గుర్తుపట్టి పనిచేస్తుంది. 

ఇది ఎప్పుడూ వింటూనే వుంటుంది సర్‌’’‘‘ఎప్పుడూ వింటూనే వుంటుందా? ఐతే మర్డర్‌ జరిగిన రాత్రి ఇది చాలానే విని వుంటుంది. ఈ విషయం నీకు తెల్సనుకోవచ్చా బేట్స్‌?’’. కొయ్యబారిపోయాడు బేట్స్‌.ఫ ఫ ఫహత్యకి సంబంధించిన రికార్డులు అమెజాన్‌.కాం దగ్గరుంటాయనీ, అవి కావాలనీ అఫిడవిట్‌ వేశారు పోలీసులు. అమెజాన్‌ ప్రైవసీ చట్టాల్ని చూపుతూ సవాలు చేసింది. ఇలాంటిది చరిత్రలో మొదటి కేసు అనీ, ఈ ‘ఎకో’ అనే డివైస్‌ హత్యకి అపూర్వ సాక్షి అయి కూర్చుందనీ, హత్య జరుగుతున్న సమయంలో ఇదేం విన్నదో చట్టానికి తెలియాల్సిన అవసరముందనీ వాదించారు పోలీసులు.

ఈ కేసు నడుస్తూండగానే, ఇతర సాక్ష్యాధారాలు సేకరించారు. ఆ రాత్రి నీళ్ళ వాడకం వివరాలు తెలుసుకున్నారు.ఎన్నడూ లేని విధంగా ఆ రాత్రి ఒంటి గంట నుంచి మూడు గంటల మధ్య 140 గ్యాలన్ల నీరు వాడారని స్మార్ట్‌ మీటర్‌ని పరిశీలించి చెప్పారు వాటర్‌ వర్క్స్‌ టీమ్‌. మరణ సమయం కూడా ఈ రెండు గంటల మధ్యే వుంది. మరి బేట్స్‌ తెల్లారి లేచి శవాన్ని చూశానంటే, ఆ 2 గంటల్లో అంత నీరు ఎవరు వాడారు? ఎందుకు వాడారు? బేట్స్‌ని మళ్ళీ ప్రశ్నిస్తే అతనొప్పుకున్నాడు. నిజానికి ఆ సమయంలోనే లేచి శవాన్ని చూశాననీ, కంగారుపడి నీళ్ళతో అక్కడున్న రక్తాన్ని కడిగాననీ చెప్పాడు. ఇది కూడా సరిపోలలేదు. పోలీసులు చూసినప్పుడు టబ్‌ పక్కన రక్తం అలాగే వుంది.‘‘బోలెడు నీళ్ళల్లో ముంచి చంపడానికే కదా, నువ్వు అన్నేసి నీళ్ళు వాడావ్‌?’’ అన్నారు పోలీసులు. మాట్లాడలేదు బేట్స్‌. కోర్టు కేసు నెలల తరబడి సాగుతూనే వుంది.‘‘అసలు ఎకో నుంచి ఏం తెలుసుకోవాలి మీరు?’’ అంది అమెజాన్‌ చివరికి. ‘‘ఆడియో రికార్డింగ్‌, దాని ట్రాన్స్‌ క్రిప్షన్‌, అమెజాన్‌ అలెక్సా యాప్‌లో స్టోర్‌ అయి వుంటాయి కదా, అవి కావాలి’’ ‘‘సారీ, వేక్‌ వర్డ్‌ పలకకుండా అది ఏదీ రికార్డ్‌ చేసుకోదు. 

నిరంతరం అది వింటూ ఉంటుందంటే అర్థం వేక్‌ వర్డ్‌ కోసమే ఆ వినడం. మీరు పలికే వేక్‌ వర్డ్‌ వింటేనే అది యాక్టివేట్‌ అయి మీ ఆర్డర్‌ని ప్రాసెసర్‌కి అందిస్తుంది. అది సీసీ కెమెరా లాంటిది కాదు జరిగేవన్నీ విని రికార్డు చేయడానికి’’ ఇలా వాదోపవాదాలతో రెండేళ్ళు సాగిన ప్రైవసీ కేసు చివరికి పోలీసుల పక్షమైంది. బేట్స్‌ డేటా ఇవ్వడానికి అనుమతించాడు. అమెజాన్‌ అందించిన డేటాలో ఏమీ లేదు. హత్యాసమయంలో ఎవరూ వేక్‌ వర్డ్‌ పలకలేదు. ఇతర భౌతిక సాక్ష్యాధారాలూ సరిగా లేక బేట్స్‌ మీద కేసు కొట్టేసింది కోర్టు. మరైతే కొలీన్స్‌ ఎలా మరణించినట్టు? మళ్ళీ మొదటి కొచ్చారు పోలీసులు…

Related Articles

Stay Connected

0FansLike
2,988FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!