23.3 C
New York
Friday, September 17, 2021

రామ్ మోహన్ నాయుడు రాజకీయ ప్రస్థానం

సమస్యను పరిష్కరించేవాడు సమర్థుడు, మార్గాన్ని చూపేవాడు సమర్థ నాయకుడు. నాయకుడంటే ప్రజల్లోనుంచే పుట్టాలి. అలాంటి నాయకుడే ప్రజల కోసం నిలబడతాడు. ప్రజల కోసమే పోరాడతాడు. ప్రజలకు మార్గం చూపుతాడు. నిజమైన ప్రజా నాయకుడే ప్రజా పక్షం నిలుస్తాడు. తన కోసం, తన స్వార్థం కోసం ప్రజా జీవితంలోకి వచ్చిన నాయకుడెవ్వరూ సుదీర్ఘకాలం కొనసాగలేరు. ప్రజల నుంచి, ప్రజల కోసం, ప్రజాప్రతినిధిగా నిలిచినవాడే నిజమైన ప్రజా ప్రతినిధి. అలా ప్రజా క్షేమం కోసం, ప్రజా సంక్షేమం కోసం, ప్రజలు కోరుకుంటే ప్రజాక్షేత్రంలోకి వచ్చిన నాయకుడు, ప్రజల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించే ప్రియతమ నేత, ప్రజాబంధు, ప్రజా ప్రతినిధి, ప్రజల మనిషి, సిక్కోలు సింగం మన కింజారపు రామ్మోహన్‌ నాయుడు. ఆయన 

నిజమైన నాయకుడు ప్రజలకు దూరమైతే ఆ బాధ వర్ణనాతీతం. అలాంటి నాయకుడిని కోల్పోయింది సిక్కోలు ప్రాంతం, తెలుగు దేశం పార్టీ. ఆ నాయకుడే దివంగత నేత శ్రీ ఎర్రంనాయుడు గారు. 2012లో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. ప్రజలను వీడి స్వర్గస్తులయ్యారు. ఆయన మరణంతో సిక్కోలు ప్రాంత ప్రజలు, తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు శోక సంద్రంలో మునిగిపోయారు. 

సింహం కడుపున సింహమే పుడుతుంది. ప్రజా నాయకుడి కడుపున నాయకుడే పుడతాడు. అలా ప్రజా జీవితంలోకి వచ్చిన యువ కెరటమే మన సిక్కోలు సింగం కింజారపు రామ్మోహన్‌ నాయుడు. తన తండ్రి ఎర్రన్నాయుడు అంతిమ యాత్రకు తరలి వచ్చిన ఆశేష జనప్రజానీకాన్ని చూసిన రామ్మోహన్‌ నాయుడుకు తన తండ్రిపట్ల ప్రజలకు ఉన్న ఆదరాభిమానాలు కళ్లముందు నిలిచాయి. ప్రజలందరూ తన తండ్రిని తమ గుండెల్లో పెట్టుకున్నారని తెలిసింది. తమ నాయకునికి ప్రజలు తమ గుండెల్లో గుడి కట్టుకున్నారు. తమ నాయకుడి మృతితో దైవం లేని కోవెలలాగా మారిపోయారు. గుండెల్లో ఉన్న నాయకుడు లేకపోతే, మరి ఆ గుండెలు ఏమవ్వాలి. నాయకుడు లేని ఒంటరి ప్రజలుగానే మిగిలిపోవాలా? అనే సందేహం రామ్మోహన్ నాయుడికి నిద్రపట్టనివ్వలేదు. ఈ ప్రజలకు తన తండ్రి అవసరం ఎంతో ఉందన్న విషయం గ్రహించాడు. తండ్రి అంతిమయాత్ర ముగిసింది. అంత్యక్రియలు సమాప్తమయ్యాయి. కానీ రామ్మోహన్‌ నాయుడు మనసు స్థిమితంగా లేదు. తన తండ్రి ఎర్రన్నాయుడు గారిని నమ్ముకున్న ప్రజలకు ఏదో చేయాలన్న ఆలోచనల పరంపరలు మనసును కమ్మేస్తున్నాయి. తనను పరామర్శించడానికి పెద్ద ఎత్తున ప్రజలను చూస్తుంటే ఆ ఆలోచన మరింత పెరుగుతోంది. ఒకవైపు తండ్రి పోయిన వేదన మరోవైపు తండ్రిని నమ్ముకున్న ప్రజలు ఈ అంతర్మథనం కొన్ని రోజుల పాటు కొనసాగింది.

సంకల్పం మంచిదైతే ఆలోచన అంకురిస్తుంది. ఆశయం గొప్పదైతే ఆచరణ అడుగు ముందుకేస్తుంది. చరిత్ర ప్రజలదైతే వర్తమానం కూడా ప్రజాపక్షమే నిలుస్తుంది. కింజారపు అరుణోదయ గర్భంలో, ఆత్మగౌరవానికి నిలువెత్తు నిలయమైన తెలుగు దేశం పార్టీ వేదికలో రాజకీయ నాయకుడిగా పురుడు పోసుకున్నాడు రామ్మోహన్ నాయుడు. అలా తండ్రి ఎర్రన్నాయుడు, పినతండ్రి అచ్చెన్నాయుడు బాటలోనే రాజకీయాల్లోకి వచ్చారు.

చిన్న వయసులోనే రాజకీయాల్లో రాణించడం వీరి కుటుంబానికి రాసి పెట్టి ఉంది. రామ్మోహన్‌ నాయుడు తండ్రి ఎర్రన్నాయుడు, పినతండ్రి అచ్చెన్నాయుడు ఇద్దరు కూడా దాదాపు 26 ఏళ్లకే రాజకీయ ప్రవేశం చేశారు. ప్రజాప్రతినిధులుగా ఎంపికయ్యారు. అదే బాటలో రామ్మోహన్‌ నాయుడు కూడా తన తండ్రి మరణాంతరం 26 ఏళ్లకే రాజకీయ ఆరంగ్రేటం చేశారు. శ్రీకాకుళం ప్రజలకు, తెలుగు దేశం పార్టీకి నాయకుడిగా తన తండ్రి లేని లోటు తీర్చేందుకు రాజకీయాల్లోకి రావాలనుకున్నాడు. రాజకీయ ఆరేంగ్రేటం గురించి పినతండ్రి అచ్చెన్నాయుడుతో పంచుకోవడం, అందుకు ఆయన ఒప్పుకోవడమే కాకుండా గెలుపు బాధ్యతలు తాను చూసుకుంటానని భరోసా ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. తర్వాత ఇదే విషయాన్ని తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి చెప్పడం అందుకు ఆయన కూడా ఒప్పుకోవడం అన్నీ అనుకున్నట్టే కలిసివచ్చాయి. ఇక ప్రజల మద్ధతు ఉండనే ఉంది. తండ్రిని గెలిపించుకున్నట్టే తనయునికి కూడా బ్రహ్మరథం పట్టారు సిక్కోలు ప్రజలు. నారా చంద్రబాబు నాయుడి ఆశీర్వాదాలతో తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రామ్మోహన్‌ నాయుడు సమీప అభ్యర్థి వైయస్సార్ సీపీ పార్టీ సభ్యురాలు రెడ్డి శాంతి పై సుమారు లక్షా ఇరవై ఏడువేల భారీ ఓట్ల మెజారిటీతో శ్రీకాకుళం పార్లమెంట్‌ సభ్యునిగా రామ్మోహన్‌ నాయుడిని గెలిపించారు. తమ ప్రతినిధిగా పార్లమెంట్‌కు పంపించారు. 

తండ్రి ఎర్రన్నాయుడు 1996లో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక కావడంతో కుటుంబమంతా ఢిల్లీలోనే ఉండేవారు. దీంతో రామ్మోహన్‌ నాయుడు విద్యాభ్యాసం కూడా ఢిల్లీలోనే జరిగింది. దీంతో ఇంగ్లీష్‌, హిందీ భాషలపై మంచి పట్టు సాధించాడు. ఉన్నత విద్య విదేశాల్లో చదవడం కూడా రామ్మోహన్‌ నాయుడుకు సమాజం పట్ల అవగాహనను పెంచుకోవడానికి ఎంతగానో దోహదపడింది. దీంతో పార్లమెంట్ వ్యవహారాలపై సమగ్రమైన జ్ఞానం సంపాదించుకున్నాడు. ఏ విషయమైన పూర్తి అవగాహనతో, విషయ పరిజ్ఞానంతో పార్లమెంట్ మాట్లాడటం అలవరచుకున్నాడు. అప్పటికే మూడు సార్లు పార్లమెంట్ సభ్యునిగా పని చేసిన ఎర్రన్నాయుడు కొడుకని అన్ని పార్టీలకు చెందిన సీనియర్‌ నేతలకు మంచి అభిప్రాయం రామ్మోహన్ నాయుడిపై కూడా ఉండేది. దీంతో ఎలాంటి భయం లేకుండా రామ్మోహన్ నాయుడు ఏ అంశంపై చర్చ అయినా, క్వశ్చన్ అవర్‌ అయిన అనర్గళంగా మాట్లాడేవాడు. పెద్ద పెద్ద రాజకీయ నేతలకు కూడా చురకలంటించేవాడు. శ్రీకాకుళం కోసం, తెలుగు రాష్ట్రాల కోసం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కోసం పార్లమెంట్ వేదికగా పోరాటం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే 2018లో బీజేపీపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాణంపై రామ్మోహన్‌ నాయుడు హిందీలో మాట్లాడిన ప్రసంగం యావత్ దేశాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రధాని మోడీకి సూటి ప్రశ్నలు వేస్తూ సాగిన హిందీ ప్రసంగం రాజకీయ వర్గాల్లో వేడి పుట్టించింది. అదే సమయంలో ఢిల్లీ స్థాయిలో తెలుగు దేశం పార్టీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. రామ్మోహన్ నాయుడు హిందీ ప్రసంగంతో ప్రతిపక్ష సీనియర్‌ నేతలను కూడా ఆలోచింప చేసింది. అన్ని పార్టీలకు చెందిన నాయకులు ప్రశంసించారు.  స్వయాన తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి మరీ ప్రశంసించడం తనకు దక్కిన గొప్ప గౌరవమని రామ్మోహన్ నాయుడు అంటారు. అంతమాత్రమే కాదు విశాఖ స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పార్లమెంట్ లోపల, వెలుపల రామ్మోహన్ నాయుడు పోరాటం చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని గర్జించారు. నినదించారు. ప్రజల పక్షం నిలబడి సమరం చేశారు. 

ఇక ఎంపీ హోదాలో కేంద్ర ప్రభుత్వ కమిటీల్లో కూడా సభ్యునిగా తన సేవలందించారు. లోక్‌ సభ హోం ఎఫైర్స్ స్టాండింగ్ కమిటీ, కన్సల్టేటివ్‌ కమిటీ, పర్యాటక, సంస్కృతి మంత్రిత్వ శాఖ, అధికార భాష, వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం ఏర్పాటై కమిటీల్లో సభ్యునిగా సేవలందించారు. అంతమాత్రమే కాక భారత పార్లమెంట్‌లో ఉన్న యువ నాయకుల్లో ఒకడిగా మంచి గుర్తింపు పొందారు. ఇలా తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూనే తన ప్రజలకు నిఖార్సైన నాయకుడిగా సేవలందిస్తున్నారు. రాజకీయం నాటకీయ మలుపులు తీసుకొనే ప్రస్తుత రోజుల్లో పార్టీని అంటిపెట్టుకొని పార్టీ విధేయునిగా ఉన్నాడు రామ్మోహన్ నాయుడు. ఆంధ్రప్రదేశ్ లో పార్టీ ఓటమి పాలవ్వడంతో సీనియర్‌ నేతలే పార్టీకి నమ్మక ద్రోహం చేస్తూ వీడిపోయారు. కానీ తనకు రాజకీయ జన్మనిచ్చిన పార్టీని, పార్టీ కార్యకర్తలను వీడిపోకుండా అనైతిక రాజకీయాలకు తావివ్వకుండా ప్రజా నాయకుడిగా ముందుకు సాగిపోతున్నారు రామ్మోహన్ నాయుడు.   

ప్రజా సేవకు వయసుతో నిమిత్తం లేదని నిరూపించిన కింజారపు కుటుంబం ప్రజా శ్రేయస్సుకే పాటుపడుతోంది. ప్రజల అదరభిమానాలతో ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడుతున్నారు. ప్రజలతో తన కుటుంబానికి, పార్టీకి ఉన్న అనుబంధాన్ని కొనసాగిస్తూ ప్రజల అభ్యున్నతి కోసం పోరాడుతున్న రామ్మోహన్‌ నాయుడు మరింత కాలం ప్రజ సేవలోనే కొనసాగాలని గొప్ప విలువలతో రాజకీయ నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా, సిక్కోలు సింగంగా రాష్ట్ర విలువను, ఆత్మగౌరవానికి కొలువైన తెలుగు దేశం పార్టీ ఆత్మగౌరవాన్ని భారతావనిలో ఇనుమడింప చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. జై రామ్మోహన్ నాయుడు, జైజై తెలుగు దేశం పార్టీ.

Related Articles

Stay Connected

0FansLike
2,945FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles