17.8 C
New York
Tuesday, September 21, 2021

చెత్తపై పన్ను వేస్తామనడం చెత్త నిర్ణయమే – నాదెండ్ల మనోహర్

పల్లెల్లో పారిశుధ్య నిర్వహణకు చెత్త పన్ను వసూలు చేస్తుండడం జుట్టుకు, గడ్డానికి, మొలతాడుకు పన్నులాగ ఔరంగజేబు పన్ను విధానాన్ని తలపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్య బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి ఉద్దేశించి పల్లెల్లో చెత్త తరలింపు పన్ను వసూలు చేయడం చిరాకు పుట్టిస్తుంది. రాష్ట్రంలోని అన్ని గ్రామా పంచాయతీల్లో దశల వారీగా పారిశుధ్య నిర్వహణ బాధ్యతల నుంచి రాష్ట్ర పభుత్వం తప్పుకుని, ప్రజాభాగస్వామ్యమనే పేరుతో ప్రజలపై పన్నుల మోత మోగించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మొదటి విడతలో భాగంగా 2020 జూన్‌ ఒకటి నుంచి 100 పంచాయతీల్లో సామాన్య కుటుంబాల నుంచి పన్ను వసూలు చేయడం తెలిసిందే. అలాగే గత అక్టోబర్‌ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా జిల్లాలోని అత్యధికంగా 472 పంచాయతీల్లో చెత్తను తరలించడానికి ఉద్దేశించి పన్నులు వసూలు చేయడం పతాకస్థాయికి చేరుకుంది. మిగిలిన 233 పంచాయతీల్లో మరో విడత కింద పన్నులు వసూలు చేయబోతోంది. గాంధీజీ ఆలోచనలకు అనుగుణంగా పల్లెల్లో పారిశుధ్య పనులు చేపట్టనుండడం వరకు బాగానే ఉంది. ప్రభుత్వ నిధుల నుంచి తాగునీరు, మరుగుదొడ్లు, తడి, పొడిచెత్త సేకరణ, వర్మీ కంపోస్టు యూనిట్లు తయారీ, ఇళ్ల మధ్యలో పేడ దిబ్బల తొలగింపు, డ్రెయినేజీ వ్యవస్థల ఏర్పాటు వంటి శాశ్వతమైన కనీస జీవన పనులను చేపట్టాల్సి ఉంది. కానీ రాష్ట్రప్రభుత్వం ఇటువంటి ప్రజల కనీస అవసరాలను తీర్చడానికి ఉద్దేశించిన పనుల్లో ప్రజల భాగస్వామ్యం పేరుతో తప్పించు కోవడం విమర్శలకు ఆస్కారాన్ని కలిగిస్తోంది. జిల్లాలోని 807 పంచాయతీల్లో పారిశుధ్య నిర్వహణకు ఉద్దేశించి రోజుకు 2 రూపాయల చొప్పున నెలకు 60 రూపాయలు వసూలు చేస్తుండడం గమనించదగ్గ విషయం. ఫైనాన్స్‌ కమిషన్‌ నిధులు, జనరల్‌ ఫండ్స్‌, పంచాయతీల ఆదాయాలు తదితర నిధులను ఖర్చు చేయాల్సిన స్థానంలో సామాన్య ప్రజల నుంచి పన్నులు వసూలు చేయాలనుకోవడమేమిటనే ప్రశ్న వినిపిస్తోంది. ఎంఎల్‌ ఏలు, ఎంపీల నియోజక వర్గాలకు ఏటా విడుదల చేస్తున్న నియో జక వర్గ అభివృద్ధి నిధులను ఏమి చేస్తున్నారనే ప్రశ్న వినిపిస్తోంది. పంచా యతీల్లో పారిశుధ్య నిర్వహణ అంశం ప్రభుత్వాల పరిధిలోని అంశం. ఇటువంటి కనీస బాధ్యతల నుంచి పాలకులు పక్కకు తప్పుకుని, ప్రజల నెత్తిన భారాలు మోపుకుంటూ పోతుండడం పట్ల సర్వత్రా వ్యతిరేకత వ్యక్త మవుతోంది. పంచాయతీల్లో తడి, పొడిచెత్తలను వేరు చేసి పన్ను వసూలు చేయడానికి వాలంటీర్లను ఉపయోగించడం విమర్శలకు దారి తీస్తుంది. చెత్త పన్నులు చేయడానికి వాలంటీర్లు ప్రజల ఇళ్ల దగ్గరకు వెళ్లడానికి జంకుతుండడం ప్రభుత్వ వ్యతిరేక పాలనకు నిదర్శనం. పల్లెల్లో పారిశుధ్య నిర్వహణకు ఉద్దేశించిన గ్రీన్‌ అంబాసిడర్లను తొలగించి, కొత్తవిధానాలను ప్రవేశపెట్టడంలో జరిగే మంచి ఏమిటనే ప్రశ్నకు సమాధానం చెప్పే నాధుడే కనిపించడం లేదు. గతంలో నుంచి పని చేస్తున్న గ్రీన్‌అంబాసిడర్లను తొలగించి, కొత్తగా ఏం సాధించ దలుచుకున్నారో పాలకులకే తెలియాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు కరోనాతో తీవ్ర భయాందోళనలతో ఆర్థికంగా పలు కష్టాలుపడుతూ ఉన్నారు. వారిలో ధైర్యాన్ని నింపి, బతుకు బండి గాడినపడేలా చేయాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యతను పూర్తిగా మర్చిపోయింది. పైగా ప్రజల నుంచి కొత్త కొత్త పన్నులు ఎలా వసూలు చేయాలి, ఉన్న పన్నులను ఎలా పెంచాలి అనే విషయం మీదే దృష్టిపెట్టింది. మున్సిపాలిటీల్లో చెత్త పన్ను పేరుతో ప్రజలను పీడించే కార్యక్రమానికి వైసీపీ ప్రభుత్వం సిద్దపడటాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ప్రజల బాధలను తీర్చాలనే కనీస ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. కాబట్టే ప్రతి ఇంటి నుంచి నెలకు రూ.90 నుంచి రూ.200 వరకూ వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. చిరు వ్యాపారుల నుంచి, తోపుడు బళ్ళ ద్వారా జీవనం పొందేవారి నుంచి కూడా ముక్కు పిండి వసూలు చేయబోతున్నారు. సంక్షేమ పథకాల ద్వారా డబ్బులు ఇస్తున్నాం అని చెబుతున్న అధికార పక్షం వాళ్ళు ఈ చెత్త వ్యవహారంపై ఏం సమాధానం చెబుతారు? ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో గుంజుకోవడమే ఇది. కరోనాతో ప్రజలు ఉపాధికి, వ్యాపారాలకు దూరమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో తగిన ఉపశమన చర్యలు తీసుకోవాలి తప్ప చెత్త మీద పన్ను వేస్తున్నాం ప్రతి నెలా కట్టాలి అనడం బాధాకరం. పాలకులు మానవత్వంతో ఆలోచన చేయడం లేదని అర్థం అవుతోంది. రాబోయే రోజుల్లో ఇంకెన్ని పన్నులను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భరించాల్సి వస్తుందో? మున్సిపాలిటీల్లో అయినా, గ్రామాల్లో అయినా పారిశుధ్య నిర్వహణ ప్రభుత్వ బాధ్యత. ఆ బాధ్యత నుంచి తప్పుకొనేందుకే ఇలాంటి పన్నులు విధిస్తోంది. వైసీపీ ప్రభుత్వం ఈ రెండేళ్ల పాలనలో ఏ నగరంలో అయినా, ఏ పట్టణంలో అయినా ఒక్క డంపింగ్ యార్డులోనైనా ఆధునిక విధానాలతో చెత్తను డిస్పోజ్ చేసిందా? పర్యావరణహితమైన విధానాలతో చెత్త నుంచి సంపద సృష్టించే పనులు చేపట్టిందా? ఇలాంటి ఆలోచనలు వదిలి చెత్తపై పన్ను వేస్తామనడం చెత్త నిర్ణయమే అవుతుంది. గతంలో చెత్తను ఎరువుగా మార్చేందుకు కేంద్రాలు నిర్మించారు. ఆ ఎరువును అమ్మడం ద్వారా రాబడి వస్తుందని చెప్పారు. అసలు ఆ కేంద్రాల నిర్వహణ ఎలా ఉంది? దానిపై రాబడి వస్తుందా? ఇప్పుడెందుకు పన్నులు వసూలు చేస్తున్నారు అనే విషయాలపై ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. చెత్త పన్ను వసూలు కోసం మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు.. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు తీర్మానాలు చేసుకొని ప్రజల నుంచి వసూలుకు సిద్ధమయ్యాయి. పారదర్శకత లేకుండా పన్నులు వసూలు చేయబోతున్నారు. తక్షణమే చెత్త పన్ను విధించాలనే అర్థరహిత ఆదేశాలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి.

Related Articles

Stay Connected

0FansLike
2,950FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!