21.9 C
New York
Tuesday, September 28, 2021

2024లో జనసేన రాజకీయ ప్రస్థానమెలా వుంటుంది.?

రాజకీయాల్లో బలం వుండాలి.. బలగం కూడా వుండాలి. మరి, జనసేనాని పవన్‌కళ్యాణ్‌కి ఆ బలం, బలగం రెండూ వున్నాయా.? అంటే ఖచ్చితంగా ఉన్నాయనే చెప్పాలి. ఎందుకంటె.. సినీ నటుడిగా పవన్‌కళ్యాణ్‌కి వున్న అభిమానుల సంఖ్య తక్కువేమీ కాదు. పవన్‌ కళ్యాణ్‌ సినీ నటుడు మాత్రమే కాదు, అంతకు మించి ఆయనలో ఏదో ‘శక్తి’ వుందని ఆయన అభిమానులు నమ్ముతారు. ఓ ‘మతం’ అనే స్థాయిలో పవన్‌ కళ్యాణ్‌ని ఇష్టపడ్తారు. ఆ ఇష్టానికి అభిమానులు పెట్టుకున్న పూర్తి పేరు ‘పవనిజం’. పవన్‌కళ్యాణ్‌ అంటే ఓ నిజం.. పవన్‌ కళ్యాణ్‌ అనేది ఓ పేరు మాత్రమే కాదు, అదొక బ్రాండ్‌.. అని నమ్మే అభిమానులు.. 2024 ఎన్నికల్లో పవన్‌కళ్యాణ్‌ని రాజకీయంగా ‘హిట్‌’ చేస్తారా? ఏమో, 2024 ఎన్నికల దాకా వేచి చూడాలి. మెగాస్టార్‌ చిరంజీవి అభిమానులే, ఆయన తమ్ముడైన పవన్‌ కళ్యాణ్‌నీ అభిమానించడం మొదలు పెట్టారు. అయితే, తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సినీ పరిశ్రమలో సంపాదించుకున్నట్టే.. తనకంటూ ప్రత్యేకంగా అభిమానుల్నీ సంపాదించుకున్నారు పవన్‌ కళ్యాణ్‌. చిరంజీవిని అభిమానించేవారంతా పవన్‌ కళ్యాణ్‌ని అభిమానిస్తారు. అయితే, పవన్‌ అభిమానులు మళ్ళీ ప్రత్యేకం. అవసరమైతే చిరంజీవిని ప్రశ్నించడానికైనా పవన్‌ అభిమానులు వెనుకడుగు వేయరు. ఆ ‘పవనిజం’ కొన్నిసార్లు మెగా కాంపౌండ్‌కి కొన్ని చిక్కులు తెచ్చిపెట్టింది కూడా. కానీ, వాళ్ళంతా దురభిమానులేననీ.. పవన్‌ని అభిమానించేవారెవరూ, ‘అన్నయ్య’ చిరంజీవినిగానీ, ఇతర మెగా కుటుంబ సభ్యులనుగానీ ద్వేషించరనే వాదనా ఒకటి వినిపిస్తుంటుందనుకోండి. అది వేరే సంగతి. 2009 ఎన్నికలకు ముందే పవన్‌కళ్యాణ్‌ రాజకీయాల్లోకి వచ్చారు. అన్నయ్య స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి మెయిన్‌ పిల్లర్‌ తమ్ముడే. అన్నయ్య సెక్యూరిటీ దగ్గర్నుంచి, పార్టీ సిద్ధాంత రూపకల్పన వరకు, అభిమానుల్ని ఒక్క తాటిపైకి తీసుకురావడం దగ్గర్నుంచి.. పార్టీపై అవాకులు చెవాకులు పేలేవారికి కౌంటర్లు ఇవ్వడం వరకు.. పవన్‌ కళ్యాణ్‌ చూపిన శ్రద్ధ అంతా ఇంతా కాదు. ‘యువరాజ్యం’ అధ్యక్షుడిగా ప్రజారాజ్యం పార్టీ యూత్‌ వింగ్‌ బాధ్యతల్ని పవన్‌ నిర్వర్తించారు. అయితే, ఆ తర్వాత పార్టీలో చిన్నపాటి సమస్యల కారణంగా, అన్నయ్య మీద అభిమానం వున్నా, ఆ తర్వాత పార్టీకి పవన్‌ దూరం కాక తప్పలేదు. పార్టీ పెట్టి, ఆ వెంటనే జనంలోకి వెళ్ళిపోయి.. ఆ తర్వాత ఫలితం ఆశించినట్లు రాకపోతే ఏంటి సంగతి.? అన్న ప్రశ్నకు ప్రజారాజ్యం ద్వారా సమాధానం దొరికింది కనుకనే, పవన్‌ ‘జనసేన’ విషయంలో ఆచి తూచి వ్యవహరించారు. బీజేపీ – టీడీపీలకు 2014 ఎన్నికల్లో మద్దతిచ్చారు. కొంతకాలం ఆ రెండు పార్టీల పాలననీ గమనించారు. విసుగెత్తి, తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. అయితే, ప్రశ్నిస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవన్‌ సరైన రీతిలో ప్రజా సమస్యల పట్ల అధికారంలో వున్నవారిని ప్రశ్నించలేక పోతున్నారేమోనన్న భావన అందరిలోనూ నెలకొంది. దానికి తోడు, పార్టీ నిర్మాణం విషయంలో పవన్‌ తగినంత శ్రద్ధ చూపడం లేదన్నదీ ప్రధాన ఆరోపణ. 2024 ఎన్నికలంటే పెద్దగా సమయం లేదు. ఇప్పటికే జిల్లాలవారీగా జనసేన అభ్యర్థులను పవన్‌ ప్రకటించినా, ఆంధ్రప్రదేశ్‌ అంతటా పర్యటించడానికి కొన్నివ్యూహాత్మక నిర్ణయాలను తీసుకున్న పవన్‌ ఈసారి జనసేన మహా పాదయాత్రపేరుతో   పవన్‌ జనంలోకి వెళుతున్నార్లెండి. అయినప్పటికీ, ఈ వేగం ఏమాత్రం సరిపోదు. నిజానికి, పవన్‌ చాలా అలసత్వం ప్రదర్శిస్తున్నారు పార్టీని జనంలోకి తీసుకెళ్ళడానికి. అదే అభిమానుల బెంగ. ఆ బెంగ తీరాలంటే, జనంలో నిత్యం పవన్‌ వుండాల్సిందే. ఏది ఏమైనా, ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్‌ వాక్యూమ్‌ పవన్‌కళ్యాణ్‌కి కలిసొచ్చే అంశం. చిరంజీవి, రాజకీయాల్లోకి వచ్చినప్పుడు లేని వాక్యూమ్‌ ఇప్పుడు స్పష్టంగా కన్పిస్తోంది. దాన్ని పవన్‌ కళ్యాణ్‌ భర్తీ చేయగలిగితే, జనసేన రాజకీయ పార్టీకి మంచి భవిష్యత్తు వుందని నిస్సందేహంగా చెప్పొచ్చు. మరి, పవన్‌ ఆలోచనలు.. వ్యూహాలు.. ఆంధ్రప్రదేశ్‌లో జనసేనకు అధికారం కట్టబెడ్తాయా.? జనసేన రాజకీయ ప్రస్థానమెలా వుంటుంది.? వేచి చూడాల్సిందే.!

Related Articles

Stay Connected

0FansLike
2,960FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!